Saturday, 28 October 2017

' విద్యా వ్యాపార పాపాలే ఈ ఆత్మహత్యలు '

' విద్యా వ్యాపార పాపాలే ఈ ఆత్మహత్యలు '
అన్న వ్యాసం . ఇది రాసింది dr . లావు రత్తయ్య , విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత . ఈరోజు ఆంధ్రజ్యోతి లో ఈ వ్యాసం చూసి ఏమాత్రమో హృదయమున్న వ్యాసం ఇది అనుకుంటూ చదివాను . కోడిని కోసుకుని తినొచ్చు కానీ కోడికి నెప్పిలేకుండా కోసుకుని తినాలి అని సగం చదివాక నాకు అనిపించిందంటే నా తప్పేమీ లేదు . చివరిదాకా చదివినా అది బలపడిందే కానీ పోలేదు . నామిని రాసిన ' చదువులా , చావులా ? ' అనే పుస్తకం ఆయన రాసిన అన్నిపుస్తకాల్లో కెల్లా గొప్పపుస్తకం . అది ఫ్రీ గా పబ్లిష్ చేసి ఇంటింటికీ పంచాల్సిన గొప్ప పుస్తకం . సహృదయులెవరైనా పూనుకుంటే బావుండు . 1% మాత్రమే ఉపయోగపడే , 1% కి మాత్రమే అవసరమయ్యే , 20% విద్యా ర్థులు కూడా చదవలేని చదువుని, అందరు పిల్లల నెత్తి మీద రుద్దుతుంటే పాపం వాళ్ళు నోళ్లు తెరిచి అడగలేరుగా ? రత్తయ్య గారి లాటి మేధావులూ అడగరు.
[24 oct 2017]

Andhra jyotho edit page- Lavu rathaaya vyasam: http://epaper.andhrajyothy.com/c/23127690


Globalization before its time

పోర్చుగీసు Vasco da Gama ఇండియా ని కనిపెట్టాడని చాలామంది చెప్పారు కానీ ఇండియాని కనిపెట్టటానికి నియమించుకున్న తన సిబ్బంది లో పద నిర్దేశకుడిగా ఒక గుజరాతీ ని పెట్టుకున్నాడని మనకెవరకైనా చెప్పారా ?
అసలు డబ్బు సంపాదించటం అనే ఒక కళ ఉందని అందులో ఎవరు ఎలా నిష్ణాతులో మన స్కూల్స్ లో ఎవరైనా మనకు నేర్పారా?
గుజరాతీలు వ్యాపారనిష్ణాతులని , హిందూ మహాసముద్రం ద్వారా అరేబియా , ఇండియా , ఆఫ్రికా ఖండాలతో మొఘల్ సామ్రాజ్య కాలంలో ఎంత వ్యాపారం చేశారో , ఎంత సంపాదించారో ,ఎలా సంపాదించారో మనకెంత తెలుసు?
గుజరాత్ వ్యాపారస్థులు ఓడల్ని నిర్మించటంలో , సముద్ర వ్యాపారం చేయడంలో చెయ్యితిరిగిన వారని , వాళ్ళ పెట్టుబడిని పెంచుకోవటంలో , మార్కెట్లని వెతుక్కోవటంలో , మార్కెట్ ఉన్న దగ్గర వ్యాపారం చేయడంలో , మార్కెట్ లేని దగ్గర మార్కెట్ ఏర్పాటుచేసుకోవటంలో అందె వేసిన చేతులని , kutch దగ్గర నుండి camby వరకు చిన్నవీ , పెద్దవీ కలిసి 46 ఓడరేవులగుండా వ్యాపారం చేశారని , ఆ వ్యాపారం ఈరోజు జరుగుతున్న సముద్ర వ్యాపారం లో సగమని తెలిస్తే అబ్బురమనిపిస్తుంది .
ఈ నేలనీ , రాజ్యాలనీ ఏలిన హిందూ , ముస్లిం రాజులూ , చక్రవర్తులకీ అసలు వాళ్లు పాలించిన ఓడరేవులనుండి ఎంత వ్యాపారం జరిగిందో ఎవరు వ్యాపారం చేశారో , ఏ వ్యాపారాలు చేసి ఎంత సంపాదించారో కూడా తెలియదంటే నిజమా అన్పిస్తుంది .
వ్యవసాయాన్ని తప్ప ఆదాయాన్నిచ్చే వనరుగా సముద్రాన్ని వాళ్లు చూడలేదని , సముద్రం వాళ్ళకొక విహార స్థలం మాత్రమేనని తెలుసుకుంటుంటే మహా రంజుగా వుంటుంది . పేరు గాంచిన జహంగీరు చక్రవర్తి గారు ,అడవిలో మధించిన ఏనుగుల్ని వేటాడుకుంటూ వచ్చిఅరేబియా సముద్ర తీరాన్ని దర్శించినపుడు , ఎగసిపడే అలల సౌందర్యాన్ని , దూరం నుంచి వచ్చే పోర్చుగీసు నౌక ని చూసి ఆనందించాడని తెలిస్తే అంతటి పేరుగాంచిన చక్రవర్తులవారూ మనలాటి ఆర్ధిక అజ్ఞానే కదా అని ముచ్చట పడతాం .

[16 oct 2017]


మనందరికీ నేలంటే మహా ప్రేమ . నాక్కూడా. నా చేతుల్తో ఎన్నడూ ఒక మొక్క నాటని , ఒక పాదుకి చెంబెడు నీళ్ళు పొయ్యని నాక్కూడా . ఇక కవి గారయితే చారెడు నేల కావాలని ఊగిపోతారు . మట్టిలొ పుట్టి మట్టిలొ పెరిగి మట్టిలొ కలిసి పోవాలని మనందరం కలలు కంటాం . మ్యాప్ లో అయితే ఖండాలు , దేశాలు , జిల్లాలు , ఎల్లలూ కొల్లలు కొల్లలు . మనకి చరిత్రని అలాగే భూమికి సంభంధిన్చిన హద్ధుల్తోనే ,భూమి కోసం జరిగే యుద్ధాలు గానే చూడటం తెలుసు . అలా కాక ఇంకోలాగా చూడటం అలవాటవుతుందా . మాటవరసకి సముద్రాల్ని విభజించిన భూమి అన్నట్లు . సముద్రాలే సర్వం అన్నట్లు . మహా సముద్రాల మీధ జరిగే వ్యవహారాలు , సముద్రాలకి అభిముఖంగా నగరాలూ , వాటి నాగరికత .కచ్ వ్యాపారస్తులది అలాటి ఒక కథ .
మనకి ఆధునికత పరచయం కాక ముందే గుజరాత్ తీరం నుండి మలబారుకి , మధ్య ప్రాచ్యానికి , దక్షిణ మధ్య ఆసియా కి విస్తృతంగా వ్యాపారం జరుగుతుండేది . గుజరాత్ తీరం నుండి ప్రాచీనకాలంలోనే కొన్ని శతాబ్దాలపాటు పశ్చిమాన వున్న మధ్యధరా సముద్రంతోనూ ,తూర్పున వున్న దక్షిణ చైనా సముద్రతీరం తోనూ ఎడతెగని వ్యాపారంజరుగుతుండేది .ఆఫ్రికా నుండి దక్షిణ ఆసియా వరకు వేరువేరు మతాలకి , సంస్కృతులకి చెందిన సముద్రతీర ప్రజలతో వ్యాపార సంబంధాలుండేవి .
ఎవరి దృష్టి తమ మీద పడకముందే మొఘల్ సామ్రాజ్యపు చివరిరోజుల్లో ఇండియాని అరేబియాని ఆఫ్రికాని కలిపే గోల్డెన్ ట్రై ఏంగెల్ ద్వారా చాలా పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారం చేసారు కచ్ వ్యాపారులు . అది అలా రెండువందల ఏళ్ళపాటు ఇండియాని పరిపాలించిన బ్రిటిష్ వలసదారుల దృష్టి గమనం లోకి కూడా రాకుండా చాపకింద నీరు లాగా జరిగింది .
తూర్పునవున్న చైనానుండి వచ్చే వాణిజ్య నౌకల్నుండి సరుకుని బంగాళాఖాతం దాటి ఇండియా పడమటి తీరం తీసుకురాకుండానే , కేరళ లో వున్న ఏదో ఒక రేవునుండి పడమటవున్న మధ్యధరాకి ,ఆఫ్రికా కి ,అలాగే పడమటనుండి వచ్చే సరుకుని కేరళరేవుల్నుండి తూర్పున వున్న చైనా వైపుకి రవాణా చేసి అంతర్జాతీయ వ్యాపారం చేసేవారు . భారీ ఎత్తున జరిగే ఈ వ్యాపారాలతో ఆసియాలొని బజారులన్నీ, చైనా సిల్క్ పింగాణీతో , ఇండియా కాటన్ వస్త్రాలతో , ఇండోనేషియా సుగంధద్రవ్యాలతో వెల్లువెత్తుతుండేవి.
ఈ జరిగే వ్యాపారాలన్నీ పాలించే రాజ్యపు జోక్యం లేకుండానే , తక్కువ సుంకాలతో నడుస్తూ వుండేవి . వాణిజ్యవివాదాల్ని పరిష్కరించటానికి చట్టబద్దమైన వ్యవస్థలుండేవి .పాలించే ప్రభువులకి సంపద సృష్టించే వ్యాపారుల పట్ల అసహనం వున్నప్పటికీ నిరంతరం రాజ్యాల మధ్య జరిగే యుద్దాలకి అడగ్గానే డబ్బు సర్డుబాటు చేసే వ్యాపారస్తుల్ని విలువిచ్చి గౌరవించేవారు . సరిగా జీతాలందని సైనికులు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారో అనే భయం ఆ పాలకులకెప్పుడూ వుండేది . అందుకనే ఆ శక్తివంతులైన వ్యాపారస్తులకి వాళ్ళడిగిన ప్రత్యేకమయిన సదుపాయాల్ని వాళ్ళిచ్చిన డబ్బుకి బదులుగా చేసి పెట్టేవాళ్ళు .

[20 oct 2017]

పిల్లలూ - ఫిలాసఫర్స్



పిల్లలూ - ఫిలాసఫర్స్
రెండేళ్లు నిండగానే బాగ్ చంకకు తగిలించుకుకుని మొదటిరోజుకూడా ఏడవకుండా ప్లే స్కూల్ కి వెళ్ళింది . ఇది వద్దు , ఇది కావాలి అనకుండా పెట్టింది మట్టసంగా తినేది . బెంగుళూరు నుండి కొన్ని తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చేస్తుంటే ' విద్యా నికేతన్ ' లాటి స్కూల్ నుండి తీసుకెళ్లి పోతున్నారా , ఇందులో సీట్ రావటం ఎంత కష్టమో తెలుసా మీకు? అని ఒకళ్ళిద్దరు లబ లబలాడారు .
ఇక్కడా షరా మామూలే , చంకకు బాగ్ తగిలిచ్చుకుని , బట్టలమీద వేసుకోకుండా ఏం పెట్టినా పెట్టిన బాక్స్ వెనక్కి తీసుకురాకుండా తినేసి , వాళ్ళు చెప్పింది చదువుకుని , ఒక్క పెన్సిల్ కూడా పోగొట్టకుండా , బుద్ధిగా ఇంటికి వచ్చేది . వాడితో గిల్లి కజ్జా లాడినా వాళ్ళన్నకి మంచి కేర్ టేకర్ . తన హోమ్ వర్క్ లు తనే చేసుకుంటూ చదివేసి చూస్తూ చూస్తూ వుండగానే 8 th కి వచ్చేసింది .
ఆరు భాషలు అలవోకగా వచ్చే బెంగుళూరు నుండి ' విద్యానికేతన్ ' లాటి మంచి స్కూల్లోనుండి హైదరాబాద్ తీసుకొచ్చేసాను కదా అని అప్పుడప్పుడూ ఎక్కడో కొంచెం బాధగా అన్పించేది .
మొన్నకరోజు జాగ్రఫీ lesson చదువుకుంటూ , వుండీ వుండీ ఒక ప్రశ్న అడిగింది " మమ్మీ భూమి ఏర్పడటానికి మనుష్యులేమీ contribute చెయ్యలేదు కదా , I mean దాని మీద వున్న అడవులూ , నదులూ , పర్వతాలూ ఏర్పడటానికి మనమేమీ చెయ్యలేదు కదా , మరెందుకు ఈ ల్యాండ్ మాది , ఈ సైట్ మాది అని అంటారు " అంది . నేను సమాధానం కోసం తడుముకున్నాను .( భూమి నాదనియన్న భూమి ఫక్కున నవ్వును)
ఇంకో రోజు రోడ్ మీద ఇద్దరమూ వెళుతుంటే మొలకలొచ్చిన శనగల్ని వేయించి బండి మీద అమ్ముకుంటున్నాడు ఒకతను . " మమ్మీ చదువుకుని ఉద్యోగం చేసి బతకాలని ఏమీ లేదు . ఇలాటి చిన్న చిన్న పనులు చేసుకుని కూడా హ్యాపీ గా బతికెయ్యొచ్చు కదా " అంది
మళ్లీ ఇంకోరోజు రోడ్డు మీద వెళుతూ వుంటే " మమ్మీ నేను మనిషిలా కాకుంటే ఇంకోలా పుట్టమంటే కాకి లా పుడతాను మమ్మీ అంది , అదేమి కోరికే అంటే "ఎక్కడికయినా ఎగురుకుంటూ వెళ్ళొచ్చు . కాకి ని కాబట్టి ఎవరూ కేజ్ లో పెట్టరు , ఎక్కడయినా ఫుడ్ దొరుకు తుంది " అంది . కాకి అన్నీ డర్టీ థింగ్స్ తిని బతుకుతుంది కదమ్మా " అని నేనంటే "మనం హోటల్స్ లో తింటల్లా , అక్కడ అంత కంటే డర్టీ " అన్నది .
శిశిరా , నిన్ను అలవోకగా ఆరు బాషలొచ్చే బెంగుళూరు నుండి , ' విద్యానికేతన్ ' లాటి మంచి స్కూల్ నుండి తీసుకొచ్చేసినందుకు లోపల ఏ కొంచెమో కూడా బాధ పడటం మానేశాను .
బెంగుళూరు లాటి ఆరు బాషలొచ్చే ఊళ్ళూ , ' విద్యానికేతన్' లాటి స్కూల్స్ ఎక్కడయినా వుంటాయి . అవి ఎక్కడయినా , ఎలా అయినా బతికే నేర్పు ఇస్తాయా ?
థాంక్ యూ శిశిరా భూమిని ఒక వస్తువులా , ఆస్తిలా చూడనందుకు .
ఎక్కడయినా , ఎలాటి పరిస్థితుల్లో అయినా బతికే ఫిలాసఫీ 13 ఏళ్లకే అర్థమయినందుకు
సంతోషపడుతున్నాను .
Happy birthday Sisira - on 27 sep 2017


బెదిరిన మనుషులు

మా అమ్మమ్మ నా పదిహేనో ఏట నుండి నేను ఎప్పుడు బయటకు వెళ్ళేటప్పుడయినా 'భద్రం' అనేది . ఆ మాట నా చెవులు సరిగా పట్టించుకోకపోయినా మనసు పట్టించుకునేది . తిరిగొచ్చేటప్పుడు రాత్రి చాలా ఆలస్యమయితే దగ్గరయినా నిర్జనం గా వుండే సందుల్ని వదిలేసి నలుగురూ మెసలుతూ వుండే పెద్ద రోడ్లమీంచి వచ్చేదాన్ని . కొంచెం వింతగా చూసినా గుంటూరు పట్టణం లో అంత భద్రత కు లోటుండేది కాదు . మా నాన్న కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పి వేరే ఊళ్లకు కూడా ఒంటరిగా పంపేవాడు . మా అమ్మను దబాయించి పెద్ద కట్టడులేమీ లేకుండానే పెరిగాను కూడా .
గుంటూరు పట్టణం దాటి హైదరబాదు నగరం చేరిన నేను కానీ , నా భర్త కానీ 13, 14 ఏళ్ళు నిండిన పిల్లలయినా సరే , ఇంట్లో ఇద్దరిలో ఏ ఒక్కరమో లేదంటే నమ్మకమయిన పనివాళ్లో , నమ్మకమయిన ఎదురింటివాళ్లో లేకుండా బయటకు కదలం . మేముండే దగ్గర రక్షణ వున్నా మా మనసుల మీద పనిచేసే మనుష్యుల భయం తో పాటు పాముల భయం కూడా వుందిలేండి .
ఈ మధ్య ఏదో పనిమీద బొగ్గరపు వెంకట్రావు గారిని కలవటం జరిగింది . ఆయనకు నాకు ముఖ పరిచయమే కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడే చనువు లేదు . అయినా కానీ ఏం చదువుతున్నారమ్మా పిల్లలు అని 8 th క్లాస్ అని చెప్పగానే ' ఇపుడే చాలా జాగ్రత్తగా వుండలమ్మా , కంటికి రెప్పలాగా కాపాడుకోవాలమ్మా , అయిదేళ్ళు అతి జాగ్రత్తగా వుండాలమ్మా ' అని అరగంట సేపు చెపితే మొదటి ఐదు నిముషాలు చాదస్తంగా అనిపించినా ఆయన మొహంలో ప్రమాద హెచ్చరికాలేవో కనపడి శ్రద్ధగా విన్నాను .
నమ్మకమయిన స్నేహితులనుకున్న వాళ్ళ ఇంటికే పంపుతాము . స్మార్ట్ ఫోన్ పూర్తిగా చేతికందనీయట్లేదు . అది తప్పని కూడా అన్పించట్లేదు .అప్పుడప్పుడు అన్పిస్తుంది మా అమ్మమ్మ కంటే మా నాన్న కంటే చాదస్తమయి పోయానా , 50 ఇయర్స్ కే ముసలాళ్లలాగా ఆలోచిస్తున్నానా అని . కానీ మా అమ్మమ్మ , నాన్న నా కడుపులో మాట చెప్పుకోగలిగిన నమ్మకాన్ని సంపాదించుకున్నట్లు నేను నా పిల్లల కడుపులో మాట చెప్పుకునే నమ్మకాన్ని సంపాదించుకున్నానో లేదో తెలియదు .
కేతు గారు 90 లొనే చెప్పారు మన ' రెక్కలు 'చాలా బలహీనమయినవని . మన రెక్కలు ఎంత బలహీనమయినా బలహీనమైన మనసులున్న తల్లితండ్రులుగా బలహీనంగా అయినా మన పిల్లల్ని కాపాడుకోవడం మానం కదా . ' చాందిని ' హత్య నేపధ్యం లో కొంతమంది రాసింది చదివి ఎందుకో ఇబ్బంది గా అన్పించింది . వాల్యూస్ గురించి , హక్కుల గురించి మాట్లాడాలన్నా భౌతికంగా ఆ అమ్మాయి వుండాలి కదా . ఆ పరిస్థితి భయానకంగా వుంది .
అయినా ఇదంతా నా మధ్య తరగతి భద్రజీవి విచికిత్స ఏమో . కోట్లాదిమంది చిన్నపిల్లలు మానసికంగా , బౌతికం గా ఏ భద్రత లేకుండా బతుకుతూనే ఎన్నో రకాల vulnerabilities కి లోనవుతున్నారు . ఇది వాళ్ళ సమస్య కాదేమో , స్మార్ట్ ఫోన్ చేతిలో వున్న వాళ్ళ సమస్యేమో .అయినా కానీ అన్నిటికీ ఆపద్భాంధవుడు మా ముసలాయన కొడవటిగంటి కుటుంబరావు కూడా ఇలా అన్నాడేమిటి? .
"దీనికి తోడు ఆ ఇంట్లోవాళ్ళు ఒక విచిత్రమయిన నాగరికత అవలంభించారు . ఆ నాగరికత ప్రకారం చిన్నవాళ్లను "రక్షించటం" చాలా అనాగరికమైన పని"
(బెదిరిన మనుషులు)

13 sep 2017

సింపుల్ మరియా -Isabel Alendy

సింపుల్ మరియా , పార్ట్ -1 , Isabel Alendy
సింపుల్ మరియా కి ప్రేమంటే చాలా నమ్మకం. ఆ నమ్మకమే ఆమెని ఆ ఊళ్ళో పేరొందిన ప్రముఖురాల్ని చేసింది . తన వ్యాపారం వదిలి ఎప్పుడూ ఎక్కడకీ కదలని ఆ సందుచివర దుకాణం నడుపుకునే గుడ్డివాడు , పోలీసుల తో సహా చుట్టుపక్కల అందరూ మరియా అంత్యక్రియలకు వచ్చారు . Valle Republica మొత్తం ఖాళీ అయింది . ప్రతి ఇంటి బాల్కనీ లోంచి నల్ల రిబ్బన్లు కిందకు వెళ్లాడదీశారు . ప్రతి ఇంట్లోనూ ఎర్ర లైట్లన్నీ స్విచ్ ఆఫ్ చేశారు . ఆడ కానీ మగ కానీ అక్కడుండే ఒక్కక్కొక్కళ్ళది ఒక్కొక్క కధ . రోజువారీ అరాచకం , హింస , పేదరికం , ఏ మూల చూసినా అన్యాయం , చిన్న వయసులోనే చనిపోయిన పిల్లలు , వదిలి పెట్టి పారిపోయిన ప్రేమికులు ఎక్కడ చూసినా అవే కధలు ఆ చుట్టుపక్కలంతా . వాళ్ళందరిమధ్య మరియా భిన్నంగా ఉండేది . ఆమెలాగే ఆమె కధ కూడా ఊహలకు రెక్కలొచ్చినట్లే , హుందాగా వుండేది . ఎలాటి అవరోధాలూ లేకుండా జాగ్రత్తగా , తన వృత్తిని ఎవరి ప్రమేయం లేకుండా స్వతంత్రంగా నడుపుకునేది మరియా . మరియా కి మాధకద్రవ్యాల పట్ల కానీ , తాగుడు పట్ల కానీ ఎలాటి ఆసక్తి వుండేది కాదు . చుట్టు పక్కల అందరూ చెప్పించుకునే , అయిదు పెసోలు తీసుకుని చెప్పే చిలక జోస్యాల పట్ల కూడా ఏ రకమైన ఇష్టమూ ఉండేది కాదు . అందర్నీ ఛిద్రం చేసే ఆశ , నిరాశల ఛట్రానికి ఆవల , తన కోసం తాను సృష్టించుకుకున్న ' ప్రేమ ' రక్షణ కవచంలో వుండేది మరియా . నాజూకు రూపూ , మర్యాదలతో , ఎవర్నీ బాధపెట్టని చిన్న సైజు మనిషి . మరియా తనంతట తాను ఎవర్నీ బాధ పెట్టేది కాదు , పలుకు మాటలు పలికేది కాదు . ఏ తార్పుడుగాడయినా ఆమె దారిలో కొచ్చి హుకుం చేయాలనుకుంటే , గోళ్ళతో , పంజాలతో దెబ్బకు దెబ్బ తీసే జంతువు లాగా ఎగబడి దెబ్బకి దెబ్బ కొట్టేది , తన ప్రాణానికి ప్రమాదమనేది కూడా లెక్క చెయ్యకుండా . చుట్టుపక్కల తనకున్న పేరు కానీ , తన ప్రమేయం లేకుండా తనగురించి ప్రచారమవుతున్న తన కధ గురించి గానీ ఏ మాత్రం తెలియదు మరియా కి . కన్య కుండే లాటి ముగ్ధత్వం తో వుండే ఒక వయసు మళ్ళిన వేశ్య ఆమె .
ఆమె జ్ఞాపకాల్లో ఒకదాని తరువాత ఒకటి
ప్రాణాలు తీసిన ఒక ట్రంక్ పెట్టె , సముద్రపు వాసన వేసే గోధుమవర్ణపు మనిషి వస్తూ వుండేవారు . ఆమె స్నేహితులు ఆమె నుండి అప్పుడప్పుడు దొర్లిన మాటల్ని ఏరుకుని , ఆ శకలాలన్నీ గుచ్చి , ఆ శకలాలమధ్య ఖాళీలలో తమ కల్పన జోడించి ఆమెకొక గతాన్ని నిర్మించారు . ఆమె అక్కడున్న అందరు ఆడవాళ్ళలాటిది కాదు . చాలా దూర ప్రాంతంనుండి , తెల్లగా వుండి స్పానిష్ ని స్పైయిన్ లో లాగా మాట్లాడే వాళ్ళ మధ్య నుండి వచ్చింది . మరియా వాళ్ళమ్మ ఉన్నత కుటుంబానికి చెందింది . మరియా మాట్లాడే పద్ధతి , ప్రవర్తన అంతా ఒక కులీన కుటుంబానికి చెందిన మనిషిలాగా వుండేది . ఆ విషయం లోఇంకా ఎవరికయినా అనుమానముంటే అది మరియా మరణంతో తీరింది . మరియా తన హుందాతనం ఏమాత్రం చెదరకుండా చనిపోయింది . ఆమెకు చెప్పుకోదగ్గ జబ్బు ఏమీ చేయలేదు . ఆమె భయపడలేదు . మిగతావాళ్లకు పోయినట్లు చనిపోయ్యేటప్పుడు చెవుల్లోనించి ప్రాణం పోలేదు . నిస్సారమైన ఈ బ్రతుకు బ్రతకడం ఇష్టం లేదని అందరికీ చెప్పింది మరియా . తనకున్నవాటిలోనుండి మంచి డ్రెస్ , పెదాలకి లిప్ స్టిక్ వేసుకుంది , తన గదిలోకి అందరూ రావటానికి వీలుగా తన గది ప్లాస్టిక్ కర్టెన్స్ తెరిచి వుంచింది మరియా .
' నేను చనిపోవాల్సిన టైం దగ్గరికొచ్చింది ' అని అందరికీ చెప్పింది .
తన మంచం మీద ఉతికి గంజిపెట్టిన గలీబులు తొడిగిన మూడు దిండ్లకు ప్రశాంతంగా , విశ్రాంతి గా ఆనుకుని ఒక జగ్గు నిండా ఉన్న చిక్కటి చాకొలెట్ ద్రవాన్ని దించకుండా తాగేసింది . ఆమె మాటలకి ముందు అక్కడున్న ఆడవాళ్ళందరూ నవ్వారు . కానీ నాలుగు గంటల తరువాత కూడా ఆమె కదలకపోవటం చూసి ఆమె చనిపోవాలని నిర్ణయించుకునే చనిపోయిందని అర్థమయ్యి ఆమె మాట చుట్టు పక్కల అందరికీ చెప్పేసారు . ఆమెని చూడటానికి వచ్చిన వాళ్ళల్లో కొంతమందే కుతూహలం తో వచ్చారు , మిగిలినవాళ్ళు బాధతో ఆమె చనిపోయేటప్పుడు పక్కనుండాలనే వచ్చారు . మద్యం ఇస్తే ఉత్సవ వాతావరణం లాగా వుంటుందని వచ్చిన అందరికీ కాఫీలు కాచి ఇచ్చారు అక్కడున్న వాళ్ళు . సాయంత్రం ఆరుగంటలకి మనిషంతా ఒక్కసారి కొట్టుకుంది . కళ్ళు తెరిచి ప్రత్యేకం ఎవరివైపూ కాకుండా చుట్టూ చూసి ప్రాణం వదిలింది . అంతే . ' ఒకవేళ ఆమె చాకొ లెట్ తో పాటు విషం కనుక కలిపి తాగిందేమో , సకాలంలో ఆసుపత్రి కి తీసుకెళ్లనందుకు పోలీసులు మనల్ని శిక్షిస్తారు ' అని ఎవరో అన్నారు . మిగిలినవాళ్ళు అలాటి పుకారుల్ని పట్టించుకోలేదు . 'మరియా కనుక ఈ లోకాన్ని వదిలి వెళ్లాలనుకుంటే ఆమెమీద ఆధారపడ్డ తల్లితండ్రులు, పిల్లలు లేరుకాబట్టి ఆమె ఆమె ఆ పని చేయాలనుకుంటే చెయ్యొచ్చు , ఆమె మీద ఆమెకి ఆ హక్కుంది .' అని ఆ ఇంటి యజమానురాలు అంది .
మరియా అంత్యక్రియలు తొందర తొందర గా ముగించేద్దామని ఎవరూ అనుకోలేదు . మరియా అంటే ఎవరో తెలియనిచోట అనామకంగా , సంతాపం ప్రకటించేవాళ్ళెవరూ లేని చోటికి తొందరగా పంపించేకంటే ఇప్పుడున్నచోటే , మరియా తన జీవితం గడిపిన చోట ఆ ప్రశాంత విషాద గంభీర వాతావరణం లోనే ఎక్కువసేపు వుంచితే బావుంటుందని Calle Republica వాళ్ళందరూ అనుకున్నారు .
ఏంచేద్దామనే దాని గురించి అందరూ తలా ఒక మాటా అన్నారు . రాత్రంతా జాగారం చేస్తే దుష్ట శక్తులు అక్కడున్న అందరికీ చెరుపు చేస్తాయేమో అని కొందరూ , వుంచితే అద్దం పగలకొట్టి ముక్కల్ని శవపేటిక చుట్టూ జల్లితే సరిపోతుందని ఇంకొందరూ , సెమినారియో చాపెల్ నుండి పవిత్రజలం తెచ్చి గది నాలుగు మూలలా జల్లితే సరిపోతుందని మరికొందరూ నలుగురూ నాలుగు రకాలుగా అన్నారు . ఆ ప్రాంతం లో ఆ రాత్రి ఎవ్వరూ పనిచెయ్యలేదు . ఎక్కడా సంగీతం కానీ నవ్వులు కానీ లేవు .అలా అని ఎవ్వరూ ఏడవను కూడా లేదు . వరండాలో వున్న టేబుల్ మీద శవపేటిక వుంచారు . ఇరుగూ పొరుగు అమర్చిన కుర్చీలల్లో వచ్చినోళ్లందరూ కూర్చుని కాఫీ తాగుతూ లోగొంతుకులతో మాట్లాడుకుంటున్నారు . శవపేటిక మధ్యలో మరియా , తలకింద శాటిన్ దిండు , చేతులు ఒకదానిమీదొకటి . మరియా చనిపోయిన కొడుకు ఫోటో ఆమె వక్షస్థలం మీద పెట్టారు . రాత్రయ్యే కొద్దీ ఆమె చర్మం రంగు మారుతూ మారుతూ ఆమె తాగిన చాకో లెట్ రంగుకొచ్చింది .
మేమందరమూ ఆ శవపేటిక చుట్టూ అన్ని గంటలు కూర్చున్నప్పుడే మరియా కధ నాకు తెలిసింది . దక్షిణం వైపు , సంవత్సరం మధ్యలో ఆకులు రాలే చోట , చలి ఎముకలు కొరికే ప్రాంతంలో గ్రేట్ వార్ అప్పుడు మరియా పుట్టింది . ఆమె ఒక మంచి కుటుంబానికి చెందిన స్పానిష్ వలసదారుల అమ్మాయి . ఎప్పుడయినా మరియా ని చూడటానికి ఆమె గదికి వెళ్లిన వాళ్ళకి అక్కడున్న బిస్కెట్ డబ్బాలో వెలిసిపోయిన కాగితాలు చూసాక ఈ వివరాలన్నీ తెలిశాయి . ఆ బిస్కెట్ డబ్బాలో ఆమె బర్త్ సర్టిఫికెట్ , కొన్ని ఉత్తరాలు , ఫోటోలు వున్నాయి . తన పెళ్లికి ముందు మరియా వాళ్ళమ్మ పియానో వాయించేది . వాళ్ళ నాన్నకు పశువుల మంద వుండేది .ఆ డబ్బాలో రంగు వెలిసిన న్యూస్ పేపర్ కటింగ్ నిబట్టి అది అర్ధమయింది . మరియా కి పన్నిండేళ్లప్పుడు , ఆమె పరధ్యానంగా పట్టాలు
దాటుతుంటే రైలు ఢీ కొట్టింది . ఒంటిమీద ఏ గాయమూ లేకుండా రైలు పట్టాలమధ్య పడివున్న మరియా ని పైకి లేవదీశారు . ఆ ప్రమాదం లో మరియా కి వొంటి మీద కొన్ని గీతలు పడ్డాయి , టోపీ ఎగిరిపోయింది అంతే . ఏ గాయమూ లేదు శరీరం మీద . కానీ ఆ తరువాత అర్ధమైందేమిటంటే ఆ ప్రమాదం లో మరియా మెదడు కి ఏదో అయ్యింది . శాశ్వతంగా ఒక బాలిక కుండే లాటి అమాయకత్వం తో మిగిలిపోయింది మరియా . ప్రమాదానికి ముందు స్కూల్ లో నేర్చుకున్నవన్నీ మర్చిపోయింది . తను నేర్చుకున్న పియానో , ఎంబ్రాయిడరీ లెసన్స్ అన్నీ మర్చిపోయింది . ఎవరన్నా తనతో మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు వినిపించుకోకుండా తను అక్కడ లేనట్లే ప్రవర్తించేది . చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే అన్నీ మర్చిపోయినా కానీ ఎవరితో అయినా మర్యాదగా ప్రవర్తించే పద్ధతి మాత్రం మర్చిపోలేదు మరియా చచ్చిపొయ్యేవరకు .
రైలు ఢీ కొట్టిన తరువాత మరియా కి తార్కికంగా ఆలోచించే శక్తి పోయింది . దేని మీద ధ్యాస లేకుండా పోయింది , దేన్నయినా కానీ
ద్వేషించే శక్తి కూడా పొయ్యింది మరియా కి .
సంతోషకరమైన భవిష్యత్ జీవితం కోసం సిద్ధం గా వుంది మరియా . కానీ మరియా జీవితంలో సంతోషం రాసిపెట్టి లేదు . మరియా కి పదహారేళ్ళప్పుడు ఆమె కి పెళ్లిచేసి తమ భారం దించుకోవాలనుకున్నారు ఆమె తల్లి తం డ్రులు . మానసికంగా ఎదగని మరియా అందం గా వుండగానే పెళ్లిచేస్తే ఆమె భారాన్ని ఇంకొకళ్ళ భుజాలమీదకి తేలికగా బదిలీ చెయ్యొచ్చను కున్నారు . Guevara లో వున్న పెళ్లికి ఏమాత్రమూ పనికిరాని రిటైర్ అయిన ఒక ముసలి డాక్టర్ కి ఇవ్వజూపారు మరియాని . కూతుర్ని ఇస్తున్నందుకు అతనిచ్చే డబ్బుని ఏమాత్రం అభ్యంతరం లేకుండా పుచ్చుకున్నారు . పిచ్చి దాని లాటి పెళ్లికూతుర్ని , ఆమెకంటే దశాబ్దాలు పెద్ద వాడయిన పెళ్ళికొడుకుని చూసి అందరూ నవ్వుతారనే భయంతో అదే సంవత్సరం రహస్యంగా చేశారు పెళ్ళి .
మొదటి రాత్రి పడక మీదకి పూర్తిగా వికసించిన శరీరంతో , చిన్న పిల్లలాటి మనసుతో వచ్చింది మరియా . పెళ్లి గురించి ఆమెకేమీ తెలియదు .ఆమెకి తెలిసిందల్లా వాళ్ళ తండ్రి పశువుల మందలో చూసిందే . బంధం పడ్డ కుక్కల్ని విడదీయటానికి చన్నీళ్ళు పనికొస్తాయని , పుంజు పెట్ట మీద కెక్కేటప్పుడు శబ్దం చేస్తూ పెట్టని ఈకల్తో మూసేస్తుందని . ఆమె చూసిన వాటి నిజమయిన జ్ఞానం ఏమిటో కూడా ఆమెకి తెలియదు .ఆమె మొదటి రాత్రి వణుకుతున్న ఒక ముసలాడు బాత్ రోబ్ వేళ్లాడుతుంటే బొడ్డు కింద దేన్నో ఆమె ఊహించని దానితో దగ్గరకి రావటం చూసింది . అప్పుడు కలిగిన ఆశ్యర్యం ఆమెకి మలబద్ధకాన్ని తెచ్చింది . బంతిలా ఉబ్బుతున్న పొట్టని చూసి విరోచనకారి మందుని ఒక పూర్తి సీసా తాగేసింది . ఆ దెబ్బతో ఇరవై రెండురోజులపాటు ఛాంబర్ పాట్ మీంచి లేవలేదు . చావు తప్పి కన్ను లొట్టపొయ్యి పీనుగయి పొయ్యింది . ఆ ఆటంకం ఆమె శక్తి ని ఏమీ తగ్గించలేక పొయ్యింది . బటన్స్ పెట్టుకునే శక్తి లేకపోయినా కానీ బ్లాండ్ కలర్ వెంట్రుకలున్న ఒక మగపిల్లాడికి జన్మనిచ్చింది . ఒక నెలరోజులు మంచం మీదే వుండి , చికెన్ సూప్ , రోజుకి రెండు లీటర్ల పాలు తాగి మళ్లీ దృఢంగా అందం గా తయారయ్యింది . ఇంతకుముందంతా ఆవరించుకున్న మబ్బంతా పొయ్యి కొంచెం తేటగా అయ్యింది . తనకు కావాల్సిన మన్నికైన అందమైన దుస్తులు తనే ఎన్నుకొనే నేర్పు సంపాదించుకుంది .
తను కొత్తగా సంపాదించుకున్న తన అందమైన దుస్తుల్ని తన వార్డ్ రోబ్ నుండి తీసి అందరికీ చూపించే అవకాశం ఆమెకి రాలేదు . ఆమె డాక్టర్ భర్తకి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర సూప్ తాగుతున్నవాడల్లా అట్లాగే వరిగి పడిపొయ్యి చచ్చిపోయ్యాడు . మరియా సంతాపాన్ని సూచించే నల్లటి డ్రస్సులకి , ముసుగు టోపీలకి పరిమితమయ్యి , వొంటినిండా బట్టల్లో కూరుకిపొయ్యి బట్టల్లో సమాధి అయినట్లే అయింది . రెండు సంవత్సరాలు ఆ నల్లటి దుస్తులు ధరించి , పేదవాళ్ళకి వితరణగా బట్టలు కుట్టీ , ఇంట్లో వున్న కుక్క పిల్లల్తో , కొడుకుతో ఆదుకునీ గడిపేసింది . పొడుగాడి ఉంగరాలు తిరిగిన జుట్టు , ఆడపిల్లల గౌను వేసి స్టూడియో లైట్ల మధ్య తీయించిన ఆమె కొడుకు ఫోటో ఒకటి ఆ బిస్కెట్ టిన్ను లో దొరికింది .
(ఇంకా ఉంది)

సింపుల్ మరియా , పార్ట్ -2 ,
Isabel Allendy
మరియా కి కాలమంతా ఒకే ఒక్క క్షణం లాగా గడ్డగట్టుకు పొయ్యింది . ఆమె గదిలోని గాలి ఇంకా అట్లాగే ఆమె భర్త ముసలివాసన తో నిండి కదలకుండా వుంది . నమ్మకమైన పనివాళ్ళు అన్నీ అమర్చి పెడుతూ వున్నారు . రోజూ అన్నో , తమ్ముడో , తల్లి తండ్రుల్లో ఎవరో ఒకరు ఆమె ఇంటికొచ్చి , వివరాలన్నీ కనుక్కుని ఆమెకి సంబంధించిన చిన్న చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటూ , ఆమె రోజువారీ ఖర్చుల్ని పర్యవేక్షిస్తూ వుండే వాళ్ళు . ఋతువులు గడిచిపోతున్నాయి . తోటలో ఆకులు రాలి కింద పడిపోతున్నాయి . హమ్మింగ్ బర్డ్స్ వేసవి పాటలు పాడుతున్నాయి . కానీ మరియా జీవితం లో ఏ మార్పూ లేదు . ఒకోసారి ఈ నల్ల బట్టలు ఎందుకు వేసుకున్నానా అని ఆశ్యర్య పోతూ వుండేది . దుప్పటి పొరల మధ్యనుంచి ఒకటి రెండు సార్లు తనని కావలించుకుని , వెంటనే తన ఇంద్రియ లోలత్వం గురించి దుఖ్ఖపడి , మడోన్నా విగ్రహం ముందు కూలబడి , కొరడా తో తనను తాను కొట్టుకున్న ముసలి భర్తని ఎప్పుడో మర్చిపొయ్యింది మరియా . అప్పుడప్పుడూ అల్మారా తెరిచి తన అందమయిన డ్రెస్సులన్నీ దులిపి సర్ది పెడుతూ వుండేది . పూలూ , లతలూ కుట్టి పూసలూ , అద్ధాలు అమర్చిన మెరిసిపోయ్యే గౌను శాటిన్ స్లిప్పర్స్ , ఫర్ స్టోల్ , చిన్న పిల్లల గ్లౌసెస్ రహస్యంగా వేసుకుని మురిసిపోయ్యేది . ఆ కొత్త డ్రెస్ వేసుకుని మూడాకుల అద్దం లో తనని తాను చూసుకుంటుంటే బాల్ డాన్స్ కి రెడీ అయిన కొత్త యువతి లాగా , తాను కాదేమో , వేరే ఎవరేమో అన్నట్లు వేరే ఎవర్నో అద్దంలో చూసుకుంటున్నట్లు చూసుకునేది .
అట్లా రెండు సంవత్సరాలు ఒంటరిగా గడిపాక తన శరీరంలో ఉరకలెత్తే రక్తం ఆమెకి భరించలేనిదిగా తయారయ్యింది . ఆదివారాలు చర్చి లో ప్రార్ధనలు అయిపోయాక దారిలో నిల్చుని వచ్చే పొయ్యే మొగవాళ్ళని చూస్తూ ఉండేది . వాళ్ళ గరుకు కంఠస్వరాలు , నున్నగా గడ్డం గీసుకున్న చెంపలు , వాళ్లనుండి వచ్చే పొగాకు వాసన ఆమెకి ఆకర్షణీయం గా వుండేవి . మేలి ముసుగు తప్పించి రహస్యంగా వాళ్ళను చూసి నవ్వేది . ఆమె ప్రవర్తనని తండ్రి , అన్నదమ్ములు గమనించి అమెరికా నేల విధవల ప్రవర్తనని పాడు చేసింది అనుకున్నారు . అందరూ కలిసి కూర్చుని మాటాడుకుని మరియా ని స్పెయిన్ లో వున్న వాళ్ళ అత్తయ్య , మామయ్య దగ్గరకు పంపాలని నిర్ణయించుకున్నారు . అక్కడ పద్ధతులు ,ఆచారాలు , చర్చి ఇక్కడికంటే బలంగా వుంటాయని అనుకున్నారు . అక్క డయితేనే ఈ ఆకర్షణలకి దూరంగా మరియా భద్రంగా
వుంటుందని అనుకున్నారు .
ఆ కారణంతో ఆ రకంగా మొదలయిన ఆ సముద్ర ప్రయాణం మరియా విధిని మార్చేసింది . సముద్రాంతర స్టీమర్ మీద , కొడుకు తో , పనిపిల్లతో , పెంపుడుకుక్కల్తో ప్రయాణం మొదలుపెట్టిన మరియా కి తల్లీ , తండ్రీ వీడ్కోలు చెప్పారు . ఆమెతో పాటు వచ్చే కొండంత సామానులో ఆమె బెడ్ రూమ్ ఫర్నిచర్ , పియానో , పిల్లాడికి పాలకి ఇబ్బంది లేకుండా వాళ్ళతో పాటు పంపించిన ఒక ఆవు కూడా వున్నాయి . ఆమెతో పాటు అసంఖ్యాకంగా వచ్చిన సూట్ కేస్ లు ,టోపీ లు పెట్టిన పెట్టల్తో పాటు ఒక పెద్ద బరువైన ఇత్తడి ట్రంక్ పెట్టె లో చిమ్మెటల్నుండి కాపాడుకున్న బాల్ గౌనులు కూడా వున్నాయి . వాళ్ళ అత్తయ్యా , మామయ్యల ఇంట్లో వాటిని వేసుకునే అవకాశం మరియా కి వుంటుందని వాళ్లకు నమ్మకమేమీ లేదు . అలా అని చెప్పి మరియా ని బాధ పెట్టటం వాళ్లకు ఇష్టం లేదు . అందుకే వాటిని ఆమెతో తీసుకెళ్ళనిచ్చారు . మొదటి మూడు రోజులు సముద్రపు ప్రయాణం పడక పక్కమీంచి లేవలేదు మరియా . తరువాత కొంచెం అలవాటు పడి , లేచికూర్చుని దీర్ఘ ప్రయాణానికి కావలిసిన రోజు వారీ బట్టల కోసం పనిపిల్లతో మూటలన్నీ విప్పించింది మరియా .
మతిపొయ్యి , ఎప్పుడూ చిన్నపిల్ల మనసుతో ఉండే మరియా ని మిగిల్చిన రైలు ప్రమాదం లాగే మరియా ని అనుకోకుండా తారసపడే దురదృష్టాలు వెంటాడుతూనే వున్నాయి . ఆమె తన డ్రెస్సుల్ని తన కేబిన్ లోని కప్ బోర్డ్ లో సర్దుకుంటుంది . ఆమె కొడుకు తెరిచిపెట్టిన ట్రంక్ పెట్టె లోకి తల పెట్టి తొంగి చూస్తూ వున్నాడు . షిప్ కి ఒక్కసారిగా వచ్చిన కుదుపుకి తెరిచిపెట్టిన ట్రంక్ పెట్టె బరువైన మూత ధడాలుమని పడి పెట్టెలోకి తొంగి చూస్తున్న మరియా కొడుకు తల తెగిపడింది . తన కొడుకు ప్రాణం తీసిన ఆ ట్రంక్ పెట్టెకి దూరంగా మరియాని ముగ్గురు బలమైన నావికులు లాగాల్సి వచ్చింది . తనను తాను గాయపరుచుకోకుండా , జుట్టు పీక్కోకుండా , మొహాన్ని బరుక్కోకుండా ఉండటానికి మరియా కి బలమైన అథ్లెట్ కి ఇచ్చేంత మత్తు మందు ఇవ్వల్సొచ్చింది . గంటలకొద్దీ గాయపడ్డ జంతువు లాగా అరిచి , మూలిగి వొంటిమీద స్పృహ లేనట్లున్న ఒక కోమా లాటి స్థితిలోకి వెళ్ళిపొయ్యి , తనను ఇడియట్ అనుకునే రోజుల్లో చేసినట్లు వెనక్కీ , ముందుకీ వూగటం మొదలు పెట్టింది మరియా . షిప్ కెప్టెన్ ఈ దురదృష్టకరమైన వార్తని లౌడ్ స్పీకర్ లో అందరికీ తెలియ చేసి , చనిపోయిన బిడ్డ కోసం ప్రార్ధించి , బిడ్డ శవాన్ని ఒక జండాలో చుట్టి పక్కనుంచి సముద్రంలోకి వదిలేసాడు . వాళ్ళు సముద్రం మధ్యలో వున్నారు . అంత్యక్రియల కోసం తరవాత రాబోయే రేవు దాకా శవాన్ని పాడయిపోకుండా కాపాడటం చాలా కష్టం .
ఈ విషాద సంఘటన జరిగిన చాలా రోజుల తరువాత ఇంకా వణుకుతున్న కాళ్లతో మొదటి సారిగా డెక్ మీదకు వచ్చింది . నులివెచ్చని రాత్రి , సముద్రంలో మునిగిపొయ్యిన నౌకలు , షెల్ ఫిష్ లు సముద్రం మీద తేలుతు న్నాయి . సముద్రం మీదనుండి తేలివస్తున్న నాచు వాసన ఆమె ముక్కుపుటాల్లోకి జొరబడి , ఆమె నరాల్లో ఉత్పాతం లాటిదేదో జరిగింది . ఆమె శరీరం పాదాల దగ్గర్నుంచి మెడదాకా చిన్నగా వణుకుతుంటే , ఏ భావమూ లేకుండా దిగంతం లోకి చూస్తూ వుంది . ఆపకుండా సన్నపాటి ఈల వినపడుతూ వుంటే తల కొంచెం పక్కకి తిప్పి చూసింది . రెండు డెక్ లకి దిగువన వెన్నెలలో ఒక నల్లటి నీడ నిలబడి ఆమెకి సైగ చేస్తుంది . ఏదో ధ్యానంలో వున్నట్లుగా నిచ్చెన దిగి ప్రేమ సైగలు చేస్తున్న ఆ గోధుమ వర్ణపు మనిషి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది మరియా . అతను తన బట్టలు ఊడదీస్తుంటే ఎదురుమాట్లాడకుండా , తన మేలిముసుగు , వేసుకున్న బట్టల దొంతరలు తీసే వరకు నుంచుంది . అతను రమ్మంటే అక్కడ ఉన్న పెద్ద తాడు చుట్ట వెనకాలికి అతనితో పాటే వెళ్ళింది . అతనితో గడుపుతూ తన రైలు ప్రమాదంలాటిది కాని ఇంకో విస్ఫోటనానికి లోనయ్యి , మొదటి మూడు నిముషాల్లోనే దైవ భీతి తో బిగుసుకుపోయిన తన ముసలి భర్తకి , కొన్ని వారాలుగా బ్రహ్మచర్యం పాటిస్తున్న గ్రీక్ నావికుడి దావాగ్ని కి మద్ధ్యనున్న తేడా తెలుసుకుంది . మరియా కి మొదటిసారిగా తన శరీరం తనకర్ధమయ్యింది . కళ్లనీళ్లు తుడుచుకుని అతన్ని ఇంకా కావాలని అడిగింది . చాలా రాత్రివరకూ వాళ్లు ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటూ అలాగే గడిపారు . చాలా రాత్రయ్యాక షిప్ నుండి మనిషి నీళ్ళల్లో పడితే మోగే ప్రమాద సంకేతాన్ని విన్నాకే అతనికి దూరంగా జరిగింది . చాలా సేపు మరియా కనపడక పొయ్యేటప్పటికి బిడ్డ పోయిన దుక్కాన్నుంచి తేరుకోలేని మరియా సముద్రంలోకి దూకేసి వుంటుందని అనుకున్న పనిపిల్ల అలారమ్ మోగించింది . గ్రీకు నావికుడు తప్ప ఓడ లోని సిబ్బంది అంతా మరియా కోసం వెతకడం మొదలుపెట్టారు .
ఓడ కరేబియన్ తీరం చేరేదాక మరియా ప్రతిరాత్రి తాళ్ళచుట్టల వెనకాల తన ప్రేమికుడిని కలుస్తూనే వుంది . ఓడ తీరానికి దగ్గరగా వచ్చింది . తీరం మీదనుంచి తేలివస్తున్న సువాసనలు , తీయని పరిమళం ఆమె ఇంద్రియాల్ని నిద్దరలేపాయి . తమని కనిపెడుతూ తమ చుట్టూ తిరిగే చూపులకి , చచ్చి పొయ్యి అక్కడే తిరుగుతున్న ఆమె పిల్లవాడి ఆత్మకి దూరంగా పోదామని గ్రీకు నావికుడు చేసిన సూచనలకి మరియా అంగీకరించింది . ప్రయాణ ఖర్చులకోసం తన దగ్గరున్న డబ్బుని లోదుస్తుల్లో దాచుకుని తన గౌరవనీయమయిన గతానికి వీడ్కోలుచెప్పి
ఓడ దిగింది మరియా . పనిపిల్లని , ఆవుని , పెంపుడు కుక్కల్ని , తన కొడుకు ప్రాణం తీసిన ఆ ట్రంక్ ని వెనకాలే వదిలేసి ఒక లైఫ్ బోట్ దించుకుని సూర్యోదయానికంటే ముందే తీరానికి బయలు దేరారు . గ్రీకు నావికుడు తన కండలు తేరిన చేతుల్తో పడవ నడుపుతూ వుంటే ఆ ఉషోదయాన ఆ అద్భుతమైన రేవు మరో ప్రపంచానికి చెందింది లా అన్పించింది . ఆ గడ్డి గుడిసెలు
ఆ కొబ్బరి చెట్లు , ఆ రంగురంగుల పక్షులు అన్నీ మరో ప్రపంచానికి చెందినవి . ఆ ప్రవాసులిద్దరూ తమ దగ్గర వున్న డబ్బు అయిపొయ్యే దాకా అక్కడ వుండలనుకున్నారు
ఆ గ్రీకు నావికుడు పేచీ కోరు , తాగుబోతు . మరియా కి కానీ , అక్కడి స్థానికులకి కానీ అర్ధం కాని భాషలో మాట్లాడుతూ వుండేవాడు . తన ముఖ కవలికలతోనో , తన నవ్వుతోనో తనకు కావాల్సింది తెలియచేస్తూ వుండేవాడు అతను . సింగపూర్ నుండి valparaiso దాకా వేశ్యావాటిక ల్లో నేర్చుకున్న విద్యలన్నీ మరియా దగ్గర చూపిస్తూ వుండే వాడు . ఆ సమయంలో మాత్రమే మరియా పూర్తి స్పృహతో చురుకుగా వుండేది . మిగతా సమయమంతా మన్నుతున్న పాములా , ఏమాత్రమూ శక్తిలేకుండా వుండేది .
(ఇంకా వుంది)

సింపుల్ మరియా , పార్ట్ -3 ,
Isabel Allendy
తీర ప్రాంతపు ఉక్కలో తడిసి ముద్ధవుతూ , తన సహచరుడు లేకుండానే ప్రేమ ని వెతుక్కోవటం మొదలుపెట్టింది అక్కడ . భ్రమాన్వితమైన ఆ నేలమీద , రాబోయే ప్రమాదాలు అర్ధం కాని ఒక పిచ్చి ధైర్యం తో తిరగటం మొదలు పెట్టింది . గ్రీకు నావికుడు తానొక వరద ప్రవాహానికి గేట్లు ఎత్తేశానని అర్ధం చేసుకో లేకుండా , అందుకు తానొక ఉపకరణం అని తనకే తెలియకుండా , మరియా తనకిచ్చే అనుభవాల్ని ఎలా తీసుకోవాలో అర్ధం కాకుండా వున్నాడు . వెగటు పుట్టించకుండా తన అమాయకత్వం తో తానే గూడు అల్లుకుని అందులో ఇరుక్కున్న ఒక కీటకం లాగా మరియా . ఆటలాడుకునే ఒక పులి పిల్లలాగా తన ఇంద్రియ లాలసతో తానే ఆటలాడుకుంటుంది మరియా .
ఆ ఆటల్లో ఆమెనెట్లా అనుసరించాలో అతనికి తెలియట్లేదు . అతని తో అతనే ఆమెకన్నీ అన్నట్టే వుండేది . ఆ ఉన్మాదం అది ఆమె రక్తంలొనే ఉంది . రేగే జ్వరక్రిమి లాగా వుంటున్న ఆ ఉన్మాదాన్ని , అది తనలో వున్నట్టు కూడా ఆమె ఊహించ లేదు . ఆ ఆనందం ఎప్పుడయియితే ఆమెకి అందుబాటులోకి వచ్చిందో , అనుభవమయ్యిందో అప్పుడే అది చిన్నప్పుడు స్కూల్లో నన్స్ చెప్పిన మంచివాళ్ళకి స్వర్గం నుంచి దొరికే ఆశీస్సులు అంటే ఇదేనేమో అనుకుంది .
ఆమెకీ ప్రపంచం గురించేమీ తెలియదు . ఒక మాప్ వేసి చూపెడితే భూమ్మీద తానెక్కడుందో కూడా తను గుర్తించలేదు . కానీ అక్కడున్న మందారాలనీ , చిలకల్ని చూసి స్వర్గం అదే అనుకుని ఆ స్వర్గాన్ని ఆనందిస్తుంది . అక్కడున్న వాళ్ళెవ్వరికీ ఆమె తెలియదు . ఇంటినుండి దూరంగా హాయిగా వుంది . తప్పించుకోజాలని తల్లితండ్రుల , అన్న దమ్ముల రక్షణ లేదు .చర్చి లో ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు . సాంఘికమైన ఒత్తిళ్లు లేవు . ఆమె లోపల ఊరే ఆనందపు ఊటల్తో తన చర్మంలో ,శరీరంలో అణువణువునీ తడిపేసుకుని , తన లోపలి జలపాతాల ధారల్లో తలమునకలుగా ఆనందిస్తూ , అలసిపోతూ వుంది .
కావాలని ఎవర్నీ బాధపెట్టని మరియా , పాపభీతి , వెరపూ లేని మరియా గ్రీకు నావికుడిలో బెదురు పుట్టించింది . రానురాను వాళ్ళిద్దరూ కలిసి కాలం గడిపే దానికంటే దూర దూరంగా ఉండేదే ఎక్కువయ్యింది . కలిసివున్నప్పుడు కూడా మౌనం రాజ్యమేలసాగింది . పసిమొహంతో వుండి కాంక్షా పీడితురాలై కోర్కెలు తీర్చటానికి తనని పిలుస్తూ వుండే మరియా నుంచి దూరంగా ఎలా పోదామా అని ఎదురుచూస్తున్నాడు గ్రీకు నావికుడు
. తను షిప్ డెక్ మీద పాడుచేసిన ఆ విధవరాలు ఆబగా తనను మింగటానికి కూర్చున్న దారితప్పిన సాలీడు లాగా , తను పడక మీద ఆమె కోర్కెల ఉధృతి లో కొట్టుకుపోయ్యే ఈగ లాగా తనకి తాను కనపడుతున్నాడు . ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో , తన మగతనానికి సవాల్ గా మారిన ఆ పరిస్థితుల్లో తనని తాను నిరూపించుకోవటం కోసం వేశ్యల్తో గడిపి , తార్పుడుగాళ్ళతో తగాదాలు పెట్టుకుని కత్తిపోట్ల దాకా వెళ్లి , ఇంకా ఏమైనా అవకాశముంటే కోడిపందాలాడుతూ గడపసాగాడు . జేబులో చిల్లిగవ్వ లేని పరిస్థితి వచ్చేటప్పటికి అక్కడ్నుంచి పూర్తిగా మాయమైపోయ్యాడు .
కొన్ని వారాలపాటు మరియా ఓపికగా ఎదురుచూసింది . అప్పుడప్పుడూ రేడియో లో బ్రిటిష్ షిప్ వదిలేసిన ఫ్రెంచ్ నావికుడో , పోర్చుగీసు షిప్ వదిలేసిన డచ్ నావికుడో పోర్ట్ దగ్గర జరిగిన గొడవల్లో కత్తిపోట్లతో మృతి చెందాడనో వార్త వస్తే చలించకుండా వింటూండేది . ఆమె ఎదురుచూస్తుంది వాళ్ళ కోసం కాదు , ఇటాలియన్ షిప్ లోంచి దూకొచ్చిన గ్రీకు నావికుడి కోసం
. ఆమె ఎముకల్లో వేడి , మనస్సులో అస్థిరత్వం భరించలేని స్థితికి చేరుకున్నాక ఓదార్పు కోసం బయటకెళ్ళి
రోడ్డు కనిపించిన మొదటి మనిషిని చెయ్యిపట్టుకుని ఆపింది . చాలా మర్యాదగా , పద్ధతి గా దయచేసి ఆమెకోసం అతనేమయినా తన బట్టలు తియ్యగలడా అని అడిగింది . ఆ కొత్త మనిషి కొన్ని క్షణాల పాటు సందేహించాడు . ఆమె ధోరణి చుట్టుపక్కల కనపడే వృత్తి వేశ్యల ధోరణి కంటే భిన్నంగా వుంది . ఆమె అడిగి న పద్ధతి అసాధారణం గా వున్నా , స్పష్టం గా వుంది . తను వెళ్లాల్సిన , చెయ్యాల్సిన పనుల్ని బేరీజు వేసుకుని ఒక పది నిముషాలు ఆమెతో గడపటానికి నిర్ణయించుకుని లోపలికెళ్ళాడు . లోపలికెళ్లేటప్పుడు అనుకోలేదు ఆమె తనను వాంఛా ఉధృతి గల సుడిగుండం లో నిజాయితీగా తోసేస్తుందని . అద్భుతపడి , చాలా కదిలిపొయ్యి , వెళ్ళేటప్పుడు ఆమె టేబుల్ మీద కొంత డబ్బుపెట్టి వెళ్ళిపొయ్యాడు
తనకు పరిచయమున్న ప్రతి ఒక్కళ్ళకీ ఆమె గురించి చెప్పాడు . ప్రేమ అనే భ్రమని కొద్దిసేపైనా అమ్మగల ఒక ఆడది వుందని పుకారు లేచి , మిగతా మగవాళ్ళు కూడా ఆమె దగ్గరికి రావటం మొదలుపెట్టారు . ఆమె దగ్గరకు వచ్చిన మగవాళ్ళందరూ తృప్తి పడ్డారు .
తొందర్లోనే ఆ ఓడ రేవులో ఆమె ప్రసిద్ధిచెందిన వేశ్య అయ్యింది . ఆమె దగ్గరకి వచ్చి పొయ్యే నావికులు ఆమె పేరు తమ చేతులమీద పచ్చ పొడిపించుకుని ఆమె ఇతిహాసానికి ఖండాంతర ఖ్యాతి తీసుకొచ్చారు .
కాలమూ , సమయమూ , తన భ్రమని నిలుపుకోవటం కోసం మరియా చేసే ప్రయత్నమూ మరియా సౌకుమార్యాన్ని ధ్వంసం చేశాయి . మరియా ఒంటిరంగు వెలిసి పాలిపోయింది . ఆమె ఒట్టి ఎముకల పోగులాగా మిగిలింది . ఆమె జుట్టుని తన సౌకర్యం కోసం ఖైదీలకు లాగా పొట్టిగా కత్తిరించుకుంది .
ఆమె ఇతరత్రా ఎలా మారినా కానీ హుందాగా వ్యవహరించే పద్ధతిని మాత్రం మిగుల్చుకుంది . మగవాళ్ళతో ప్రతి ఒక్క కొత్త కలయికలోనూ అదే ఉత్సాహాన్ని చూపెడుతూ వచ్చింది . వాళ్ళని ఆమె ఎప్పుడూ ముక్కూ మోహమూ తెలియని వస్తువుల్లాగా చూడలేదు . వాళ్ళతో గడిపేటప్పుడు తన ఊహా ప్రేమికుడి కౌగిలి లో తనను తానొక ప్రతిబింబం లాగా చూసుకునేది . తన తాత్కాలిక సహచరుడిలో తొందర తొందరగా తన కోర్కెలు తీర్చుకెళ్లాలనే ఆతృతని పసిగట్టలేకపోయేది . తన దగ్గరకొచ్చే ప్రతి ఒక్కళ్ళకీ రాజీ లేని తన ప్రేమని పంచుతూ అంతే కోర్కెతో వాళ్ళు కూడా తనకు దగ్గరవ్వాలని కోరుకునేది .
వయసుతో పాటు ఆమె జ్ఞాపక శక్తి క్షీణించి పోసాగింది . ఒకోసారి ఏం మాట్లాడుతుందో తెలియనట్లు మాట్లాడుతుండేది . ఆమె ఆ ఓడ రేవునుండి రాజధాని calle Republica కి మారేటప్పటికి , ఆమె తనకి సంబంధించిన విషయాలన్నీ మర్చిపోయింది . ఒకప్పుడు తాను అన్ని జాతులకీ చెందిన నావికుల కల్పనా కవిత్వానికి చోదకశక్తినని మర్చిపోయింది .
ఆసియా లో ఎక్కడో ఒక ఓడరేవులో తాము విన్న ఆమె గురించి , ఆమె బ్రతికే వుందా అని ఎవరైనా ఆమె ఇంతకు ముందున్న ఓడరేవు పట్టణంనుండి ఆమె కోసం వెతుక్కుంటూ ఆమె వున్న నగరానికి
వస్తే ఆమెకి ఆశ్యర్యంగా వుండేది . తాము విన్న మాంత్రిక కథల్లోని మనిషితో గడుపుదామని వచ్చిన వాళ్లు , ఒక మిడత లాంటి , ఒక ఎముకల కుప్పనీ , ఎవరికీ చెందని ఆ చిన్న మనిషినీ చూడగానే , తాము విన్న ఆ మనిషి బూడిదలో కలిసిందని , అంతులేని బాధతో వెనక్కు తిరిగి వెళ్ళిపొయ్యేవాళ్ళు .
అట్లా వెనక్కి తిరిగి వెళ్లకుండా ఎవరైనా జాలితో వుండపొయ్యుంటే గనుక వాళ్ళకి ఊహించని బహుమతి దొరికేది .మరియా ఆ గదికున్న ప్లాస్టిక్ కర్టెన్ వెయ్యగానే వాతావరణమంతా మారిపొయ్యేది . వాళ్ళు వెళ్ళేటప్పుడు తామొచ్చినప్పుడు చూసిన దయనీయమైన పరిస్థితిలో వున్న ఒక ముసలి వేశ్య ను కాకుండా కావ్యాల్లో వర్ణించే సుందర జ్వలిత వధూ రూపాన్ని తమతో తీసుకెల్లేవాళ్ళు .
మరియా గతం తొందరగానే రంగు వెలిసిపోయింది . ఆమెకి తనను ఢీ కొట్టిన రైలు , మూతపడి తన కొడుకు ని బలిగొన్న ట్రంకు పెట్టెల గురించిన భయం తప్ప ఏ జ్ఞాపకమూ స్పష్టంగా మి గల్లేదు . అక్కడున్న మిగతా వేశ్యలకి ఆమె గురించిన గతం తెలియకపొయ్యుంటే ఆమె కధ మరుగునపడిపోయ్యుండేది . ఆమె నిరంతరం ఆ గది కర్టెన్ తెరుచుకుని ఆమెకి ఆ గ్రీకు నావికుడినో , లేదంటే ఆమె ఊహల్లో వుండే ఏ దయ్యాన్నో చూపిస్తుందని ఎదురు చూస్తూ వుండేది . ఆరోజు రాత్రి ఆ డెక్ మీద తనలో ఆ వెలుగు వెలిగించిన , తనను రగిలించిన , ఆ రెండు చేతుల భద్రతకోసం ఎదురుచూస్తూ వుండేది . ఆ ప్రాచీన భ్రమని , తనని దాటి వెళ్ళిపొయ్యే ప్రతిమగవాడిలోనూ వెతకడానికి ప్రయత్నించేది . వెలగక ముందే ఆరిపోయిన , రవ్వల్లాగా తనని కౌగలించుకుని వెళ్ళిపొయ్యే ఆ నీడల్లో , తనని వెలిగించిన ఆ ఊహ ప్రేమని వెతుకుతూ వుండేది . ఎదురు చూసీ, చూసీ అలసిపొయ్యి , నిరాశతో ధ్వంసమయ్యి , ఆమె ఆత్మ మీద పొలుసులు పేరుకుని ఇక అప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే మంచిదనే నిర్ణయానికి వచ్చింది . అప్పుడు కూడా ఆ సమయంలో అంతే సున్నితంగా , అంతే హుందాతో తను చెయ్యాలనుకున్నది చేసేసింది . తన ముందున్న నిండు జగ్ చోకోలేట్ ని తాగేసింది .
(అయిపొయింది,,)

The stories of Eva Luna. , Isabel Allende published in 1991

చిన్నప్పుడు తొమ్మిదో తరగతిలో మా తెలుగు మాస్టారు మమ్మల్ని సరదాగా ఒక ప్రశ్న అడుగుతూ వుండేవాడు . ' ఒరేయ్ పంచదార ఎలా వుంటుందిరా ' అని మేమందరం పోలోమని తెల్లగా వుంటుంది మాస్టారూ అని అరిచేవాళ్లం . ఇంకా ఎలావుంటుందిరా పలుకులు , పలుకులుగా బరువుగా వుంటుంది మాస్టారూ అని అరిచేవాళ్ళం , ఇంకా ఎలావుంటుందిరా అనేవాళ్ళు తియ్యగా వుంటుంది మాస్టారూ అనే వాళ్ళం . తియ్యగా అంటే ఏమిట్రా అనేవాళ్ళు .ఏమిటో చెప్పటానికి ఎవరి నోళ్లు పైకి లేచేవి కావు . తియ్యగా అంటే ఏంటో చెప్పటం కష్టంరా , అది తెలియాలంటే మీ నోట్లో గుప్పెడు పంచదార పొయ్యాల్సిందే అని తెలుగు పాఠం లోకి తీసుకెళ్లేవాళ్లు . అప్పుడేం పాఠం చెప్పారో గుర్తులేదు కానీ పుస్తకాలు చదువుతున్నప్పుడు చాలాసార్లు ఆయన మాటలు గుర్తుకొచ్చేవి . మనకు బాగున్నవి వేరే వాళ్ళతో పంచుకోవటమంటే మనం తిన్న పంచదార వేరేవాళ్ళ నోట్లో కొంచెం పొయ్యటమే . అప్పుడు మన అనుభవం , వాళ్ళ అనుభవం ఒకటే అయినపుడు మాట్లాడుకోకుండా తల వూపినా , కళ్ళు కలిపినా ఒకళ్లకొకళ్ళం అర్ధమైపోతాం . నాకలా ' Isabel Allende ' కథలనిపించినయ్ . మొదటి కథ ' Two Words ' చదువుతూనే భలే వుందే అని translate చేసాను . తరవాత రెండో కథ , మూడో కథ ఏకథకాకధ అలాగేభలే అనిపించసాగాయి . 14 కధలు చదివాను . ఇంకా 9 కధలు చదవాలి . ప్రతి కధ దేనికదే unique piece . వస్తు వైవిధ్యం అంటే అరిగిపోయిన మాటల్లాగా అనిపిస్తుంది కానీ ఆడవాళ్లు కుట్టించుకునే డిజైనర్ బ్లౌజ్ ల్లాగా ప్రతి కధా ఒకదానికొకటి సరిపోలదు . అంత వస్తువైవిధ్యం వుంది .
రెండో కధ 'wicked child ' లో మన పూటకూళ్ళ ఇల్లు లాటి బోర్డింగ్ హౌస్ నడుపుకునే విధవరాలు అందులో ఒక బోర్డర్ తో ప్రేమ లో పడి ఆ తరువాత పెళ్లి చేసుకుంటుంది . ఆమె కూతురు 11 ఏళ్ల అమ్మాయి . పళ్ళు ఊడి ఇంకా రాని అమ్మాయి అదే బోర్డర్ పట్ల ఆకర్షింపబడి తను తిరిగి అతని ప్రేమని పొందాలంటే తల్లి లాగా అతనితో శారీరకంగా సన్నిహితంగా వుండాలనుకుని అతను నిద్రపోతునప్పుడు ఆ ప్రయత్నం చేస్తుంది . అతనికి మెలకువ వచ్చి 'Wicked Child ' అని దూరంగా నెట్టేెస్తాడు . ఆ అమ్మాయిని హాస్టల్ కి పంపిస్తారు . మళ్లీ ఆ అమ్మాయి 26 ఏళ్ల వయస పుడు తను చేసుకోబోయే బాయ్ ఫ్రెండ్ ని తీసుకుని ఇంటికి వస్తుంది . అదీ కధ . కధా వస్తువు చాలా చిన్న విషయం . ఆవిడ ఎంత అనితరసాధ్యంగా రాసిందంటే ముగింపుమాటలు చూడండి ' ఆ గురువారం మధ్యాహ్నం నిన్ను తో సేసినప్పుడు నేను సగం నిద్రలో వున్నాను , నువ్వేం చేస్తున్నావో , నేనే అంటున్నానో తెలియని స్థితిలో నిన్ను తోసేసాను . అలా చెయ్యలనుకోలేదు ' అని చేతులు పట్టుకుని బ్రతిమాలతాడు . నిజానికి అతనికేం కావాలో అతనికే తెలియదు .ఆ అమ్మాయిని తోసేసినమరుక్షణం నుంచి ఆ బాలిక రూపం అతడితో వుండిపొయ్యింది , సంవత్సరాలు గడిచినా మసకబారిపోకుండా , అదే రూపంలో ప్రేమగా తనకు దగ్గరవ్వాలనే ఆ ప్రయత్నం చేసినప్పటి రూపంలో , అతన్ని వెంటాడుతుంది. కానీ ఆ అమ్మాయేమో అతని మాటలకి తెల్లబోయింది . ఆమె తన బాల్యాన్ని వదిలేసి చాలా దూరం వచ్చేసింది , ఆ మొదటి నిరాకరణ ఆమెకే గుర్తులేని మరపు తెరల్లో ఎక్కడో రహాస్యంగా వుండిపోయింది.ఇప్పుడయితే ఆమెలో ఆ ప్రత్యేకమయిన గురువారం గురించి జ్ఞాపకాలేమీ లేవు . చాలా మామూలుకధ . కానీ ఆ narration చదువి తీరాలి . ఇంకో కథతో ఇంకోసారి .
The stories of Eva Luna. , Isabel Allende published in 1991
[28 aug 2017]

వాళ్ళ రహస్యం[Our Secret] - ఇసాబెల్ అఎండీ

వాళ్ళ రహస్యం [Our Secret] - ఇసాబెల్ అఎండీ  
--------------------------------------------------------
[on 15 aug 2017]

తిరిగీ తిరిగీ అలసిన శరీరం చమట వాసన వెళ్లగక్కుతూ వుంటే నిశ్శబ్దంగా చూస్తున్న ఆమె , అతన్ని అలాగే తన శరీరాన్ని నిమరనిస్తూ వుంది . ఏ చిన్నపాటి కదలిక చేసినా అది దారి తప్పి ఆమె జ్ఞాపకాల్లోకి పోయి ఆ క్షణాల్ని పాడు చేస్తుందేమో అనే స్పృహతో వుంది . ఆ రోజు పొద్దున అనుకోకుండా రోడ్డుమీద తారసపడ్డాడు అతను . ఏ ప్రత్యేకతా లేని అలా తారసపడే వాళ్ళందరి లాగే వున్నాడు అతను . ఏ గతమూ లేని తమ మధ్య కరగ బొయ్యే క్షణాలు దుమ్ములో కలిసిపోకూడదనే స్పృహతో వుంది ఆమె . ఆమె గోధుమరంగు జుట్టుకి , సన్న సన్న మచ్చలతో ఎండకి కమిలిన ఆమె చర్మానికి , ఆమె చేతులకి కట్టుకున్న బ్రేస్ లెట్ ల కున్న మువ్వల గలగల లాడే శబ్దానికి ఆకర్షింపబడి , నడుస్తూనే ఆమెతో మాట కలిపాడు అతను . గమ్యం లేకుండా వీధుల్లో నడుస్తూ , ట్రాఫిక్ గురించి , వాతావరణం గురించి మాట్లాడుతూ , ఏ కోపమూ బాధా లేకుండా , తప్పు చేస్తున్నానేమో అనే ఆలోచన లేకుండా రోజంతా ఆమెతో మాట్లాడుతూనే వున్నాడు . కానీ లోపల ఎదో బిగుసుకు పోయింది . పరాయి దేశంలో , తెచ్చి పెట్టుకున్న ఆత్మ విశ్వాసం అతనిది . ఆమెతో ఆ రోజు గడపదలుచుకున్నాడు . ఇద్దరూ కలిసి పుస్తకాల దుకాణాలు , పార్కులు చక్కర్లు కొట్టి , కాఫీలు తాగి , ఆమె పరిచయయానికి ఆనంద పడుతూ వున్నాడు అతను . ఇద్దరూ కలిసి , గత జీవితపు జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చుకున్నారు . తమ మాతృ దేశంలో ఇద్దరూ ఒకే ఊళ్ళో పుట్టిపెరిగి వుంటే ఎలా వుండేదో అని ఊహించారు . ఇద్దరూ ఒకే పల్లెపట్టులో పుట్టి పదునాలుగేళ్లు వచ్చేవరకు అక్కడే గడిపినట్లు ఊహించి ఆనందిస్తూ , అక్కడ ఆ నిషేధిత మాతృ దేశంలో చలికాలం లో మంచుకు తడిచిన బూట్లు , వెలిగించిన చలినెగళ్లూ , వేసవి సాయంత్రాల్ని గుర్తుకు తెచ్చుకుంటూ అలా రాత్రయ్యేవరకూ తిరిగారు .
అలా తిరుగుతూ వుండగానే ఆమెనేదో కొద్దిగా ఒంటరి తనం చుట్టుముట్టినట్లయింది .అనుకోకుండా తారసపడిన ఈ మనిషితో , ఏ ఇబ్బందులూ లేకుండా ఈ రాత్రి గడుస్తుందా అని ఆలోచిస్తూ వుంది . రోజంతా తిరిగి అలిసిపొయ్యాక , ఇంక తిరగటానికి ఏ చోటూ , కారణమూ కనపడక , ఏదో ఒకటి మనసులో నిర్ణయించుకుని అతనిచెయ్యిపట్టుకుని తన ఇంటికి తీసుకుని పొయ్యింది ఆమె . చెత్త కుండీలు పొర్లి పొంగుతూ వుండే ఒక సందులో మురికిపట్టిన ఒక అపార్టుమెంటు లో తన లాటి రాజకీయ శరణార్ధుల తో కలసి వుంటుంది . చాలా చిన్న గది అది . నేలమీద వేసిన ఒక పరుపు , దాని మీద వేసిన ఒక గళ్ళ దుప్పటి . ఇటుకలమీద చెక్కలు పేర్చి రెండు వరసల్లో అమర్చిన పుస్తకాల అర , కుర్చీ మీద పడేసిన బట్టలు , ఒక మూలన వున్న సూట్కేస్ .
అతన్ని సంతోషపెట్టాలని అని అనుకున్న చిన్నపిల్లలాగా గదిలోకి రాగానే తన ఒంటిమీద వున్న బట్టలు తీసేసింది . అతను ఆమెకి దగ్గరవ్వటానికి ప్రయత్నించాడు . ఆమె శరీరాన్ని నిమురుతూ , ఆమెను చిచ్చుకొడుతూ ఆమె ఎత్తుపల్లాల మీదుగా శరీరంలోకి రహస్యపు దారులు వెతుకుతూ , ఆమె కూడా అతన్ని కోరుకుంటూ , ఆమెని ఒక మైదా ముద్దను చేసి , దగ్గరకు తీసుకున్నాడు . కానీ ఎందుకో అతనిలో ఏ చలనం లేనట్లుగా అయి బిగుసుకుపొయ్యి వెనక్కు తగ్గాడు . ఆమె తనని తాను కూడగట్టుకుంది . ఏమీ జరగలేదన్నట్లుగా అతని దగ్గరగా జరిగి , అతన్ని బుజ్జగిస్తూ , స్పర్శిస్తూ , రెచ్చగొడుతూ బిడియం చుట్టుముట్టగా అతని పొట్టలో తలపెట్టి తన ముఖాన్ని దాచుకుంది . అతని శరీరమంతా తేలికగా అయింది , కొంచెం సేపు ఆమె ఏమి చెయ్యాలనుకుంటే అది చెయ్యనిచ్చి , అవమానమూ , దుక్కమూ , విషాదమూ చుట్టుముట్టగా ఆమెను తోసేశాడు . ఇద్దరూ సిగరెట్ లు ముట్టించుకున్నారు .
పొద్దుట్నుంచీ వాళ్ళని కలిపి వుంచిన , ఒకళ్ళనుండి ఒకళ్ళు ఏదో పొందాలనే ఆశ ,తోడుదొంగల్లాటి భావం ఏదో వాళ్ళమధ్య ఎగిరిపోయింది . మాటలు లేని భయంకరమైన సూన్యం లోకి తేలిపోయిన నిస్సహాయ ప్రాణుల్లా ఆ పరుపు మీద అలా పడున్నారు వాళ్ళు . పొద్దున్న వాళ్లిద్దరూ కలిసినప్పుడు కూడా వాళ్ళ మధ్య అసాధారణమైన ఆశలు ఏమీ లేవు . ప్రత్యేకమయిన పథకాలు ఏమీ వేసుకోలేదు వాళ్లు . గది లోపలికొచ్చేటప్పుడు కూడా కొంచెం తోడు , కొద్ది పాటి సంతోషం గురించిన ఆశ , అదే వాళ్ళల్లో వున్నది . కానీ ఇప్పుడు , వాళ్ళని తెలియని విషాదమేదో చుట్టుముట్టింది . వాళ్ళని చుట్టుముట్టిన ఒంటరి తనానికి సాకులు వెతుకుతూ ' మనం తిరిగి తిరిగి బాగా అలిసిపొయ్యాం కదా ,అందుకే ఇలా ' అంది ఆమె చిరునవ్వు నవ్వుతూ . తనని తాను కూడగట్టుకోవటానికి కావాల్సిన సమయం కోసం ఆమె ముఖాన్ని చేతుల్లో కి తీసుకుని కనురెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు . పక్కపక్కనే పడుకుని , ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని దయాన్వితమైన ఆకుపచ్చని ఈ విదేశీ నేలమీద అనుకోకుండా కలిసిన వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకున్నారు .
తన పీడకలల సాలీళ్లు తనని కుట్టి తమ మధ్య వున్న గాలిని విషపూరితం చెయ్యకముందే బట్టలేసుకుని వీడుకోలు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోదామనుకుని ఆమె వైపు చూసాడు . ఆమె చిన్నపిల్లలాగా , అసహాయంగా రక్షణ లేనట్లుగా అన్పించింది . ఆమె స్నేహితుడిగా వుండిపోతే బాగుంటుంది అనుకున్నాడు . ఆమె స్నేహితుడిగా , ప్రేమికుడిగా కాదు . సున్నితమైన విషయాల్ని పంచుకుంటూ ,ఏ బంధనాలు , ఒత్తిళ్ళూ లేకుండా స్నేహితుడిగా ఆమె భయాల్ని పారదోలుతూ ఆమె పక్కనే , కేవలం స్నేహితుడిగా . అతను ఆమెచేతిని వదిలిపెట్టాలనుకోలేదు . సుకుమారమైన , సున్నితమైన , అంతులేని ఆర్ద్రత ఏదో ఆమెకోసమూ , అతని కోసమూ అతనిలోనుండి . కిటికీ కి కట్టిన కర్టెన్ గాలి పోసుకుని ఎగిరింది . కిటికీ మూసేస్తే ఏర్పడే చీకటి వాళ్లిద్దరూ కలిసుండాలనే కోర్కెకూ , ఏకాంతానికీ అవకాశమిస్తుందేమో అని కిటికీ ముయ్యటానికి లేచింది ఆమె .
కానీ అతనికి చీకటి ఇష్టం లేదు . తొంభై సెంటీమీటర్ లున్న అతని ఖైదు గదిలో , అనంతమైన అగాధం లాటి ఆ గదిలో విముక్తే లేనట్టుగా బంధించబడి , గవులు కొట్టే తన ఉచ్ఛలో , దొడ్డిలో తనే దొర్లుతూ , ఒక ఉన్మాద స్థితిలో చాన్నాళ్లు బతికాడు. కిటికీ మూస్తే అది అతనికి గుర్తుకు వస్తుంది . కర్టెన్ వేయకు , పక్కకి జరుపు , వెలుతురులో నేను నిన్ను చూడాలి అన్నాడు అబద్ధమాడుతూ . నెత్తి మీది ముళ్ళకిరీటం లాటి తనని నొక్కేసే ఆ బరువు , ఎడతెరిపిలేని దాహం , తన రాత్రి భయాలు , కళ్ళముందు కదలాడే భూగృహాలు , దయ్యాల ఆకస్మిక దాడి , ఇవన్నీ ఆమెకి తెలియచెప్పే ధైర్యం అతనికి లేదు . అవన్నీ ఆమెకు చెప్పాలని కూడా అనుకోలేదు అతను . ఒక విషయం ఇంకో విషయానికి దారి తీస్తుంది . అదంతా ఎపుడూ బయటకు చెప్పుకూడని విషయాలు బయటకు చెప్పటం తో అంతమవుతుంది . ఎందుకొచ్చిన బెడద .
ఆమె కిటికీ దగ్గర్నుంచి పరుపు మీదకి వచ్చి ఏదో ఆలోచిస్తూ అతన్ని జోకొడుతుంది , తన వేళ్ళని అతని శరీరం మీద వున్న మచ్చలమీదుగా పోనిస్తూ పరిశీలిస్తుంది . ఒక దీర్ఘమయిన నిట్టూర్పు తో నవ్వుతూ భయపడకు , అదేమీ అంటువ్యాధి కాదు ,అవి మచ్చలు మాత్రమేలే అన్నాడు . ఆమె అతని ఆందోళన గ్రహించి , తను చేస్తున్న పనిని ఆపేసింది .
ఆ క్షణంలో అతను ఆమెకు చెప్పుండాల్సింది వాళ్ళ మధ్య జరిగేది ఏదీ ఒక కొత్తప్రేమకు నాంది కాదనీ , వాళ్ళది కొనసాగుతున్న ప్రేమా కాదని , అది ఇద్దరిమధ్యా అంగీకారంతో కొన్ని అమాయకపు క్షణాల్ని ఒడిసిపట్టుకోవటమని . ఆమె నిద్ర పోగానే తను వెళ్లిపోతాడని , అతను ఆమెకి చెప్పుండాల్సింది . వాళ్ళిద్దరికీ భవిష్యత్తు లేదనీ , వాళ్ళ మధ్య రహస్య సంకేతాలు ఏవీ లేవనీ , మళ్ళీ ఎప్పుడూ చేతిలో చెయ్యేసుకుని రోడ్ల మీద తిరగరనీ , ప్రేమికుల మధ్య వుండే ఆటలేవీ వాళ్ళ మధ్య వుండవని అతను ఆమెకి చెప్పుండాల్సింది .
కానీ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయి , అతని గొంతెక్కడో పూడుకుపొయ్యింది . అతను ఎక్కడో మునిగిపోతున్నాడని అతనికి తెలుస్తూనే వుంది . అతను తన చేతుల్లోనించి జారిపోయే వాస్తవాన్ని గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు . తన ఎదురుగా కుర్చీ లో వున్న ఆ బట్టలమీదో , నేల మీద పేర్చబడివున్న పుస్తకాల మీదో, గోడ మీద అంటించి వున్న చిలీ దేశపు పోస్టర్ మీదో , కరేబియన్ రాత్రి మీంచి వీస్తున్న ఆ చల్ల గాలుల మీదో , రోడ్డు మీంచి వస్తున్న ఆ రాత్రి శబ్దాలమీదో , తనతో గడుపుదామనుకుని తన ఎదురుగా కూర్చున్న ఆ అమ్మాయి మీదో , ఆమె నిదుపాటి పొడవైన వెంట్రుకల మీదో , ఆమె శరీరం మీంచి తెలివస్తున్న పరిమళం మీదో దృష్టి నిలపాలని ప్రయత్నం చేసాడు .
ఆ పరుపు మీద ఒక చివర బాసింపట్లు వేసుకుని ఒక ఫకీరు లా కూర్చుని , ఆమె పాలిపోయిన వక్షస్థలం , బొడ్డూ అతన్ని గమనిస్తూ వుండగా వణుకుతున్న అతన్ని టకటకమని కొట్టుకుంటున్న అతని పళ్లనీ , అతని మూలుగునీ చూస్తున్న ఆమెనీ చూస్తూ తనని ఈ నిస్సహాయ క్షణాలనుండి బయటపడేయమని పెగలని గొంతుకతో అర్ధించాలనుకున్నాడు . అతనిలో పేరుకు పోతున్న నిశ్శబ్దం అతనికే వినపడుతుంది . ఇంతకు ముందు చాలాసార్లు జరిగినట్లుగా అతను ముక్కలు ముక్కలు గా విడిపోతున్నట్లు గా అన్పించింది . వర్తమానాన్ని పట్టుకోవటానికి తన చివరి ప్రయత్నం వదిలేసి ఎక్కడో కొండ శిఖరం మీద నుండి లోయలోకి పడిపోతున్నట్లున్న తనని తాను పట్టుకునే ఏ ప్రయత్నమూ చెయ్యకుండా వదిలేసాడు . తన మణికట్ల మీద , ముణుకుల మీద బిగించి కట్టిన తాళ్ళు , తన మీద మోపబడ్డ అభియోగాలు , చితికిన కండరాలు , పేర్లు చెప్పమని గద్దిస్తూ అవమానించే గొంతులు , అతని పక్కనే చిత్రహింస చేయబడ్డ 'ఆనా' మరిచిపోలేని అరుపులు , మైదానం లో చేతులు కట్టేసిన , వేళ్లాడుతున్న మనుషులు , అవన్నీ అతని మది లోకి వచ్చాయి .
ఏమయింది ? ఏంటి విషయం అని అడుగుతున్న ' ఆనా ' గొంతు దూరంగా వినపడుతూనే వుంది . ఇసుకలోనించి దక్షిణంవైపుకి లాక్కెళ్లబడ్డ 'ఆనా' కనపడుతూనే వుంది .
తనకెదురుగా , నగ్నం గా వుండి తనని కదుపుతూ , పిలుస్తూ లేపుతున్న ఆ యువతి ఎవరో గుర్తు పట్టటానికి ప్రయత్నం చేసాడు . కానీ కళ్ళముందు ఏవో మసక తెరలు రెపరెపలాడుతూ . లేచి కూర్చుని ముందుకు వంగి తన తల దిమ్ముని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేసాడు . కూర్చోగానే అతను 'ఆనా' కోసమూ , మిగిలిన అందరికోసమూ ఏడవటం మొదలెట్టాడు .
' ఎందుకు? ఏమైంది?' మళ్ళీ ఆ అమ్మాయి ఎక్కడ్నుంచో పిలవడం వినపడుతుంది . ' ' 'ఏమీ లేదు . నన్ను కొంచెం పట్టుకో ' బ్రతిమిలాడాడు అతను . అతని వైపు కొంచెం బెరుకుగా కదిలి అతన్ని రెండు చేతుల్తో దగ్గరకు తీసుకొని , చంటిబిడ్డను లాలించినట్లు లాలించి , అతని నుదుర్ని ముద్దాడి అతని వీపు పరుపుకానించి పడుకోబెట్టి ' కానీ ఎంత ఏడవాలనిపిస్తే అంతా ఏడువు ' అంటూ అతని మీద నిలువునా తనని తాను పరుచుకుని పడుకుంది .
ఒక వెయ్యి సంవత్సరాల పాటు వాళ్ళు అలా కలిసి పడుకుని వుంటారు . భ్రమలు , భ్రాంతులు అన్నీ నెమ్మదిగా కరిగిపొయ్యి , మళ్ళీ ఈ ప్రపంచం లోకి , ఆ గది లోకి అతను తిరిగి వచ్చి తను బ్రతికే వుండటం , శ్వాస పీల్చుకోవటము , నాడి కొట్టుకోవటమూ , తన శరీరం మొత్తం మీద ఆ అమ్మాయ్ బరువు వుండటమూ , ఆమె తల అతని ఛాతీ మీద వుండటమూ , ఆమె కాళ్ళూ ,చేతులు అతని కాళ్ళూ చేతులమీద వుండటమూ అదంతా చూసాడు . వాళ్లిద్దరూ భయపడిపోయిన ఇద్దరు అనాధల్లా వున్నారు .
ఆ క్షణంలో ఆమె అన్నీ తెలిసినట్లుగా ' కోర్కె కంటే , ప్రేమ కంటే , ద్వేషం కంటే , కోపం కంటే , తప్పు చేసానన్న భావన కంటే విధేయత కంటే అన్నిటికంటే భయం బలమయినది . అన్నిటినీ మింగేస్తుంది ' అన్నది . ఆమె కళ్లమ్మట నీళ్లు , చెంపలమీదుగా కారి అతని మెడ పక్కల్నుంచి కిందకి దొర్లాయి . అతని లోపల చాలా లోతుగా వున్న గాయాన్ని ఆమె ముట్టుకుంది .
అతనికెందుకో ఆ అమ్మాయి తన మీద జాలితో తనతో కలిసి గడపటం లేదనిపించింది . తనలో వున్న నిశ్శబ్ధాన్ని దాటి , తనలో వున్న ఒంటరితనాన్ని దాటి అత్యంత గోప్యం గా ఒక ఇనపపెట్టెలో అతను దాచిపెట్టిన 'కల్నల్' నీ , అతని కుట్రనీ దాటి ' ఆనా ' ని , కళ్ళకు గంతలు కట్టబడి కుట్ర కు బలయిన సహచరుల్ని దాటి చూడ గలిగింది . ఇదంతా ఆమెకెట్లా అర్ధమయింది .
ఆమె లేచి కూర్చుంది . ఆమె స్విచ్ కోసం వెతుకుతుంటే కిటికీలోనుండి పడే మసక వెలుతురులో ఆమె నాజూకైన చెయ్యి నీడలాగా కనపడింది . ఆమె దీపం వేసి తన చేతులకి వేసుకున్న బ్రాసెలెట్ లన్నీ వూడదీసి శబ్దం లేకుండా పరుపు మీద పడేసింది . ఆమె చేతుల్ని అతని ముందుకి చాపినప్పుడు ఆమె జుట్టు ఆమె మొఖాన్ని సగం కప్పేసింది . ఆమె మణికట్టు చుట్టూ కూడా తెల్లటి మచ్చలు . అతను ఏమీ కదలకుండా కాలం ఆగిపోయినట్లుగా అలాగే చూస్తూవుండిపోయ్యాడు , అతనికి అంతా అర్ధమయ్యేదాకా . ఎలక్ట్రిక్ గ్రిడ్ కి ఆమెని కట్టేసి వుండటం అతని కళ్లకి కనపడింది . వాళ్లు ఎదురుబొదురుగా కూర్చుని ఒకళ్ళనొకళ్లు కావలించుకున్నారు . ఏడ్చుకున్నారు . నిజాల్ని , రహస్యాల్ని , కలబోసుకున్నారు . నిషేధింంచబడ్డ మాటల్ని , రేపటి మీద ఆశల్ని కలిసి పంచుకున్నారు . చివరాఖరుగా వాళ్ళ లోపల దాచుకున్న అతి ముఖ్యమయిన రహస్యాన్ని కూడా పంచుకున్నారు .

ఐశ్వర్యా రాయ్ - సమంతా

ఐశ్వర్యా రాయ్ అంటే నాకొకందుకు గౌరవం . శారీరక సౌందర్యం ఒక టూల్ గా (దాని ప్రమాణాలు ఏవైనా కానీ , నాకెప్పుడూ విమల సౌందర్యాత్మక హింసే గుర్తుకొస్తుంది మరి) వ్యక్తిగతంగా ఎదగటానికి ప్లాన్ చేసుకుని అందులోనూ ఆమె ఉన్న మోడలింగ్ ఫీల్డ్ లో కెరీర్ ప్లానింగ్ చాలా కష్టమయింది . ' జీన్స్' లాటి సినిమాలో నటిగా మనల్ని బెదరగొట్టినా , తరువాత నటిగా ఎంతో మెరుగు పడి , సల్మాన్ ఖాన్ తో అందరికీ కనపడేంత చెంపదెబ్బ తిని ఇబ్బందులు పడి , మనందిరి అభిమానాన్ని ఎంతో కొంత పొంది , ఇంతవరకు ఏ మధ్యతరగతి అమ్మాయి , మోడల్ cum సినిమా యాక్టర్ అయినా ఇదంతా ఇలాగే జరుగుతుంది . అయితే వేరే వాళ్ళకి ఇంత సక్సెస్ రేట్ వుండదు .
అయితే ఆమె లైఫ్ ఆ తర్వాతే ఇంటరెస్టింగ్ గా అన్పించింది నాకు .డబ్బు , సక్సెస్ రేట్ వున్న ఐశ్వర్యరాయ్ ని అప్పటికే పేరు ప్రఖ్యాతులున్న కుటుంబం వరించింది . (కుటుంబమే వరించింది , అభిషేక్ బచ్చన్ కాదు) . మోడల్స్ cum సినిమా యాక్టర్స్ అష్టకష్టాలు పడి ఎదిగి ఎవరికో అనామకంగా రెండో భార్య గానో , లేదంటే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లోనో చూడటం అలవాటయిన మనకి ఐశ్వర్యారాయ్ కుటుంబ జీవితంలో కూడా ట్రెండ్ సెట్టరే . మారుతున్న పరిస్థితుల్లో ఐశ్వర్యారాయ్ ని అత్తామామలు , భర్తా వున్నదాన్ని వున్నట్టుగా ఆమోదించారు . ఆమెని ఎదిగించారు . తాము ఎదిగారు . సినీ నటుల కుటుంబంగా వున్న వాళ్ళు ఒక కార్పొరేట్ కుటుంబంగా ఎదిగారు . ఇదంతా ఐశ్వర్యారాయ్ ని ముందు పెట్టుకునే .
ఇదంతా నాకు సమంతా చేనేత వీడియో షూట్ పోస్ట్ చూసిన రోజు గుర్తొచ్చింది . అప్పటివరకు మధ్యతరగతి కుటుంబాన్నుంచి వచ్చానని చెప్పుకుని , సోషల్ వర్క్ చేస్తూ నటిగా మంచి మార్కులు తెచ్చుకుని మర్యాదగా అందరికీ ఆమోదనీయంంగా వుండే సమంతా తన ఎంగేజిమెంట్ తరువాత చేనేత కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యింది . సెన్సేషనల్ గా మాట్లాడటం మొదలుపెట్టింది . అన్నం లేకపోయినా వుండగలను కానీ శృంగారం లేకుండా వుండలేను అన్నది , అప్పుడే ఆ కాళ్ళు కనిపించే , వక్షస్సు కనిపించే ఫోటోలు బయటకొచ్చాయి .
ఆ విషయం లో ఆమె మెట్టబోయే కుటుంబం think big గానే ఆలోచించింది . సినీ తారల అపఖ్యాతి ఖ్యాతి లాంటిదే అని వాళ్ళకి బాగా తెలుసు . సమంతా కూడా తెలివి తక్కువది కాదు . ఎంగేజ్మెంట్ అవ్వకపోతే , మెట్టబోయే ఇంటివాళ్ళ ఆమోదం లేక పోతే అలాటి స్టేట్మెంట్స్ , అలాటి షూట్ చేసేది కాదు .వేలకోట్ల వాళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి పైసా పెట్టుబడి అవసరం లేని ప్రచారకర్త సమంతా . వాళ్ళ కుటుంబం గురించి , కాబోయే మామగారి గురించి ,భర్త గురించి ఆలోచించకుండా సమంతా గురించి ఆలోచించలేము . వాళ్ళ సినిమాలు హిట్ ఆయినా కాకపోయినా వాళ్ళ గురించి ఆలోచించకుండా వుండలేము . ఐస్వర్యారాయ్ జీవితంలో భాగంగా ఆమె కుటుంబముంది . సమంతా!ఇకముందు కూడా కాబోయే అత్తింటి కుటుంబానికి ప్రచారం చేయబోయే కాబోయే కార్పొరేట్ కోడలు . ఇదంతా అర్ధం చేసుకోమంటే సరే . ఇందులో ఏదో చేనేత , సమాజమూ , అభ్యుదయమూ చొప్పొంచి think big అంటే ఎలా , ఎవరికోసం?

మెడోస్ టైలర్ ఆత్మకథ - పద్మావతి.బి

Thanks to Vaakili web magazine team for publishing this in Aug 2017.


పుస్తక పరిచయం

సురపురం – మెడోస్ టైలర్ ఆత్మకథ






నకిప్పుడు ఎక్కడికైనా వెళ్ళటానికి బస్సులు, రైళ్లు, విమానాలు, ఎవరితో అయినా మాట్లాడటానికి రకరకాల సమాచార వ్యవస్థలు, ఏ మూల పల్లెటూరికైనా కనీసం ఒక మట్టిరోడ్డు, మన స్థిర చరాస్తు లేవైనా కానీ వాటిమీద మన హక్కు, మనమీద ఎవరైనా దాడి చేస్తే పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఇంకో ఆలోచన లేకుండా మన జీవితంలో బాగం అయిపొయాయి. ఇవన్నీ లేని ఒకానొక కాలంలో – 1824 లో – ఇంగ్లాండు నుండి ఒక 16 ఏళ్ల కుర్రవాడు బొంబాయిలో ఈ దేశపు గడ్డ మీద అడుగుపెట్టి ఒక 36 సంవత్సరాలు ఈ దేశంలో తిరుగుతూ తను చూసిన కళ్ళతో అక్షరాల్లో అవన్నీ చూపిస్తుంటే చూడటం ఎంత బావుంటుంది. ఈ రోజు భారతదేశం కంటే అప్పటి భారతదేశం కళ్ళకింకా ఇంపుగా కనపడుతుంది అతని అక్షరాల్లో.మెడోస్ టైలర్ ఇంగ్లాండ్ లోని లివరపూల్ లో 1808 లో పుట్టాడు. తండ్రివైపు, తల్లివైపు బంధువులు ఇంగ్లాండ్ లో పలుకుబడి గల కుటుంబాలకు చెందినవాళ్ళు. తండ్రి వ్యాపారమేదో చేసి నష్టపోయాడు. మెడోస్ టైలర్ ది అత్తెసరు స్కూల్ చదువు. 13, 14 ఏళ్ల వయసులోనే భారతదేశం తో వ్యాపారం చేసే సంస్థలో ఒక చిన్న ఉద్యోగం చేసాడు. తండ్రి లాగే అతనికీ వ్యాపారం చేయటమంటే ఇష్టం. బాక్సర్ అనే వ్యాపారస్థుడి దగ్గర బొంబాయి లో పనిచేయటానికి, భవిష్యత్తు లో అతని వ్యాపారం లో భాగమవ్వటానికి మాట్లాడుకుని మెడోస్ టైలర్ ఇంగ్లాండ్ నుండి ‘నాలుగున్నర నెలలు ప్రయాణం’ చేసి తన పదహారవ ఏట 1824 లో బొంబాయి లో కాలు పెట్టటం తో అతని భారతదేశ ప్రస్థానం మొదలవుతుంది.మెడోస్ టైలర్ ఒకరకమైన ప్రజ్ఞ తో పుట్టాడు. ఇచ్చిన పని సమర్ధవంతం గా చేయగలడు అనే గురి అతనిమీద ఎవరికయినా కలుగుతుంది. భారతదేశం లో బాక్సర్ వ్యాపారం సరిగా లేకపోవటం, బాక్సర్ నుంచి సకాలంలో సరియైన సమాచారం బొంబాయి చేరకపోవటం అనే కారణాల వల్ల తన తల్లి పెత్తల్లి కుమారుడైన బొంబాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘ న్యూ హోమ్’ సహాయం చేసి హైదరాబాద్ లో నిజాం కొలువులో సైనికోద్యోగం ఇప్పిస్తాడు మెడోస్ టైలర్ కి.
బొంబాయి నుండి బయలుదేరేటప్పుడు ‘ నువ్వు ఉపయోగపడతావని తేలగానే నిన్ను ఉపయోగకారిగా చేస్తారు. నిబ్బరంగా తెలివితేటలతో చేసుకో, విజ్ఞతతో వ్యవహరించమని చెప్పిన న్యూ హోమ్ సలహా తో బొంబాయి నుండి హైదరాబాద్‌కు బయలుదేరతాడు మెడోస్ టైలర్.
పనిచేస్తూ నేర్చుకోవడం, అట్లా నేర్చుకున్న పనిని సమర్ధవంతంగా చేయటం, అట్లా పనిచేస్తూ తన చుట్టూవున్న వాళ్ళ హృదయాలని గెలుచుకోవటం మెడోస్ టైలర్ కి అప్రయత్నంగా అబ్భింది. ఈ పుస్తకం పూర్తయ్యాక మనల్ని ఆకర్షించింది మెడోస్ టైలర్ వ్యక్తిత్వమా, ఆయన చూపించిన మన దేశమా అని తేల్చుకోలేకపోతాం.
1758 ప్లాసీ యుద్ధం తరువాత భూమి నుండి వచ్చే ఆదాయం, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మీద పన్ను ద్వారా లభించే డబ్బు ఆయా ప్రాంతాల్ని బట్టి స్థానిక సంస్థానాధీశులకైనా, జమీందార్లు నవాబులకైనా, నిజాముకైనా, కొన్ని చోట్ల ప్రత్యక్షంగానూ, కొన్ని చోట్ల పరోక్షంగానూ పరిపాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ కయినా అదే ఆదాయ వనరు. వీళ్ళందరితో పాటు అప్పటికి లక్షల్లో అప్పులివ్వగలిగే వడ్డీ వ్యాపారస్తులు బలమైన వర్గం.
ఈస్ట్ ఇండియా కంపెనీ కున్న ఇంకో వెసులు బాటు వ్యవసాయం ద్వారా వచ్చే మిగులుని వర్తకానికి ఉపయోగించి వాళ్లదేశం నుండి తెప్పించిన వెండీ, బంగారం తో చెల్లింపులు చెయ్యకుండా ఇక్కడి వ్యవసాయం మీద మిగులుతోచేసి, దేశమంతటా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరింపచేసుకోవటం వాళ్ళకి మాత్రమే వున్న వెసులుబాటు. వ్యవసాయం మీద ఎక్కువ మిగులు రావాలంటే వ్యవసాయం చేసే విస్తీర్ణం పెరగాలి. కొన్ని ప్రాంతాల్లో జమీందార్ల కింద గానీ ఇంకొన్ని ప్రాంతాల్లో రైతువారీ పద్ధతి ద్వారా గానీ వ్యవసాయం చేసే రైతులకి, కౌలుదార్లకీ ఏ భూమి మీద అయితే కష్టపడుతున్నారో ఆ భూమి మీద కష్టపడే హక్కు, స్థానిక పెత్తందార్ల మూలాన సందేహాస్పదంగా మిగిలిన ఆ హక్కు నికరంగా వుండాలి. వ్యవసాయ భూముల మీద ప్రాపర్టీ రైట్స్ క్లియర్ గా ఉండాలి. వ్యవసాయం మీద వచ్చే ఆదాయం దొంగలు, దోపిడీదార్ల పాలవ్వకుండా తమకే దక్కుతుందనే భరోసా వుండాలి. స్థానిక నీటివనరుల్ని వుపయోగించుకొనే సౌలభ్యం వుండాలి. అప్పటికి పుంతలుగానే వున్న దారుల్ని రహదారులు చేయాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూములన్నీ సర్వే చేయించాలి. జిల్లాల సరిహద్దులు, అధికారానికి సంబంధించి రెవిన్యూ, సివిల్ క్రిమినల్ విషయాలకి వీటిల్లో ఒకదానితో ఒకటి ఎంతమేరకు జోక్యం చేసుకోవచ్చనే అధి కారానికి సంబంధించిన విచక్షణ ఇవీ ఆ రోజుకి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశ రాజకీయ, ఆర్ధిక విషయాల్లో జోక్యం చేసుకుంటున్న బ్రిటిష్ ఎడ్‌మినిస్ట్రేషన్ ముందున్న కర్తవ్యాలు.
అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక రాజకీయ వ్యవహారాల్లో తమ జోక్యం కోసం ‘ రెసిడెంట్ ‘ ని కొన్ని కొన్నిచోట్ల వుంచారు. అలాగే నిజాం రాజ్యం లో కూడా. ఆ రాజ్య పాలకుడు తమ వ్యాపార ప్రయోజనాలకనుకూలమైన నిర్ణయాలు చేసినంతకాలం ఆ ‘ రెసిడెంట్ ‘ ఆ రాజ్యానికి అనుకూలంగా వుంటాడు. రాజ్య పాలకుడు తమకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ పాలకుడి మీద మిలిటరీ దాడి చేయించి తమకనుకూలమైన వాళ్ళనో, లేదా తామే పాలకులగానో అవతారమెత్తుతారు. ఇదీ అప్పటి భారతదేశ రాజకీయ ముఖచిత్రం.
గుర్రాలతో, గుడారాల తో ప్రయణిస్తూ, కవాతు నేర్చుకుంటూ, రెండు దళాల జమా ఖర్చులు చూస్తూ, ఒక మున్షీ ని పెట్టుకుని హిందూస్థానీ బాష నేర్చుకుంటూ, మధ్య మధ్యలో అడవిపందుల్నీ, పిట్టల్నీ వేటాడుతూ, సమర్ధుడు అని ‘రెసిడెంట్ ‘ దృష్టిలో పడి హైదరాబాద్ చేరతాడు.
అప్పటి హైదరాబాదు ఎలా వుండేదో మెడోస్ టైలర్ మాటల్లో ….
“ అప్పటి నగర జనాభా మూడున్నర లక్షలు. హాయిగా తిరిగేవాడిని.మూసీ నది ఒడ్డున నిలబడి చూస్తుంటే కోటలు, గోడలు, బురుజులు, ఒకపక్క బేగం బజారు, చక్కటి చెట్లు ఎంతో మనోజ్ఞమైన దృశ్యాలు, నదిలో పలువురు స్నానం చేస్తూ వుండేవారు, గుడ్డలు వుతుకుతూ వుండేవారు.చెలిమలు తవ్వి నీళ్లు తీసుకు వెళుతూ వుండేవారు. ఇసుకతో వొళ్ళు రుద్దుతూ వుంటే.. హాయిగా నిలబడి వుంటే.. ఏనుగులు, రకరకాల దుస్తులు ధరించిన జనం, ఒకవైపున చార్మినార్, మక్కా మసీదు, విశాలమైన మీర్ ఆలం చెరువు, దూరంగా ఆకాశం లో కానవచ్చే గోలకొండ ఖిల్లా, సూర్యోదయ కాలం కమ్మ తెమ్మెరలు అనుభవిస్తూ, బంగారు కాంతులీనే సూర్యాస్తమయాలు, ఆ ఇసక తిప్పలపైన ముస్లిం పెద్దలు తివాచీలు పరిపించుకుని, ఎవళ్ళ హుక్కా వాళ్ళు తాగుతూ, వాళ్లతో సంభాషిస్తూ కాలక్షేపం చేయటం నాకు వినూత్నమైన అనుభవం “
పర్షియన్ బాష నేర్చుకోవడం మొదలుపెడతాడు. ‘ రెసిడెంట్ ‘ అతనిని బొలారం లో సైన్యానికి ఇచ్చే సరుకుల ధరలు, నాణ్యానికి సంబంధించిన విషయాలు చూడమని పంపిస్తాడు.వాటినన్నిటినీ ఒక క్రమంలోకి తెచ్చినందుకు సిపాయిలందరూ సంతోషిస్తారు. పై అధికారి మెచ్చుకుంటాడు.
మెడోస్ టైలర్ కి సైనికోద్యోగం కంటే పౌర పరిపాలనా వ్యవస్థలో ఉద్యోగం అంటే ఇష్టం. సదాశివపేట ప్రాంతానికి పోలీస్ అసిస్టెంట్ సూపరిండెంట్ గా పంపిస్తారు. అప్పుడతనికి 18 సంవత్సరాలు నిండలేదు. అతనికిచ్చిన ప్రాంతం 250 మైళ్ళ పొడవు, 60 మైళ్ళ వెడల్పు 10 లక్షల జనాభా కలది. ఆ జిల్లా పరిధిలో గల వ్యాపారస్తులు తప్పుడు తూనికలతో ప్రజల్ని మోసం చేస్తుంటే వాళ్ళని సరిచేయటానికి బంజారాల్ని పిలిపించి వ్యాపారం చేయిస్థాడు. తూనికలు, కొలతలు పరిశీలించటానికి పోలీసులకు హక్కు కల్పిస్తాడు. అతను ఆ జిల్లాలో తిరుగుతూ ఒక విషయం గమనిస్తాడు. ‘ నేనున్న జిల్లాలో బోలెడన్ని జమీందారీలున్నవి. నిజాం ప్రభుత్వ ఉత్తర్వులని వాళ్ళు ఖాతరు చేయరు. హైదరాబాదు లో పలుకుబడి కల పెద్దలున్నారు. ఈ జమీందారులకి ఆ పెద్దల అండదండలున్నవి. దొంగలు, బం దిపోట్లు ఈ జమీందారుల్ని ఆశ్రయించుకుని తమ క్రూరకృత్యాలు సాగిస్తున్నారు. ఆ దొంగలు సంపాదించిన ధనం లో జమీందార్లకు వాటాలున్నవి. అటువంటి జిల్లాలో శాంతి భద్రతీసు కాపాడటం కష్టం. ముందు నాకు గల అధికారాలు, వ్యవహరణ పరిధులు స్పష్టంగా తేల్చుకోవాలి’ అనుకుంటాడు. ఇది 1826 లో తెలంగాణా పల్లె చిత్రం.
రెవిన్యూ సర్వే చెప్పి అక్రమాలు చేసి, లంచాలు పుచ్చుకునేవారెందరినో పట్టుకుంటాడు. అప్పుడా ప్రాంతంలో దాయాదుల్ని హత్య చేసిన ఒక జమీందారు నెలకి 300 రూపాయిల జీతగాడైన మెడోస్ టైలర్ కి లక్ష రూపాయలు లంచమిస్తానన్నా లొంగడు.ఆ ప్రాంతంలో ధగ్గుల కదలికల్ని పసిగడతాడు.ఆ జిల్లాలో పనిచేస్తూ ఎవరు చేసుకుంటున్న భూమిని వారికి ఇచ్చే కార్యక్రమం, బాటలకు రక్షణ కార్యక్రమం చేబడతాడు. అక్కడున్నప్పుడు మరాఠీ బాష నేర్చుకుంటాడు. సైన్యం లో చేసిన మార్పులవలన అతనికి పిలుపు వచ్చి హైదరాబాద్ చేరతాడు. తిరిగివెళ్ళేటప్పటికి అతనికి 21 ఏళ్ళు.
హైదరాబాద్ లో పామర్ తో ఎక్కువ స్నేహం మెడోస్ టైలర్ కి. చరిత్ర పట్ల,సాహిత్యం పట్ల ఆసక్తిని పామర్ తో మాట్లాడుతూ తీర్చుకొనేవాడు. పామర్ విశాలమయిన గ్రంధాలయం మెడోస్ టైలర్ జ్ఞానం పెరగటానికి ఎంతగానో ఉపయోగపడింది. ఒకానొక సందర్భం లో నిజాం కి, అతని తమ్ముడికి వచ్చిన గొడవ లో సైనిక చర్య జరపాల్సిన సందర్భంలో – అత్యంత సహనం తో దాన్ని పరిష్కరించినందుకు అతని సైనికులు అతనిని ‘ మహాదేవ బాబా ‘ అని పిలిచి జై కొడతారు. నిజాం తమ్ముడు తనకు ఇచ్చిన ముప్ఫయి వేల రూపాయల బహుమానాన్ని తిరస్కరిస్తాడు. 1832 లో పామర్ కూతురు మేరీ తో సికిందరాబాదు చర్చిలో అతని వివాహమవుతుంది.
మనకు చరిత్రలో భాగమయిన విలియం బెంటింగ్, లార్డ్ మెకాలే, డల్హౌసీ అందరికీ తను పనిచేసే క్రమం లో దగ్గరౌతాడు. మెకాలే గురించి అతడి జ్ఞానం అపారమైందని, అతడితో పరిచయం మూలాన తను ముందు ముందు ఏమేమి చదువుకోవాలో అర్ధమయిందని, అతనితో కలిసి పనిచేస్తే బావుండేదని అనుకుంటాడు. ఉష్ణ మండలం లో ఉండటం వలన ఆరోగ్యం పాడయి రెండు సంవత్సరాలు సెలవు తీసుకుని 1938 లో ఇంగ్లాండు కి వెళతాడు. ‘భారత దేశంలో అనాగరిక తండాలలో నివసిస్తున్న లక్షణాలేవీ నీలో లేవే’ అని అక్కడి వాళ్ళు ఆశ్యర్యపోతారు.
‘ భారతదేశంలో ప్రజలు ఉన్నత నాగరీకత కలవారేనని, వారూ ఇంగ్లీష్ అంత వారేనని చెప్పినా ప్రయోజనం లేదని అని- వారు నమ్మని కథలని నేనెందుకు చెప్పాలని ‘ అంటాడు. ఇంగ్లాండు లో వున్నపుడే ‘ Confessions of a Thug ‘, ‘టిప్పు సుల్తాన్’ మీద పుస్తకం రాస్తాడు. బొంబాయి నుండి 1824 లో తను హైదరాబాద్ వచ్చినప్పటి పరిస్థితి పోలుస్తూ ఇప్పుడు 1840 లో దోవపొడవునా దున్నని భూములు ఎక్కువగా కన్పడ్డాయి. పంట బాగా వుంది, మునపటికంటే సర్వే బాగా సాగుతుంది, పన్ను తగ్గటమే కాకుండా భూమి విలువని బట్టి నిర్ణయించటం జరుగుతుంది, మెట్ట ప్రాంతాలలో జొన్నలు, అపరాలు, పల్లపు ప్రాంతాలలో జొన్న, గోధుమ కనపడతాయి. దేశపు తీరుతెన్నులు మారిపోతున్నాయి అనుకుంటాడు. మధ్య మధ్య లో గుడారాల్లో మజిలీ చేస్తూ ఏనుగులమీద, గుర్రాల మీద సాగిన ఆ ప్రయాణం లో అడుగడుగునా ప్రజల బ్రహ్మాండమయిన స్వాగతం, అతనక్కడ వున్నప్పుడు తమకు జరిగిన మేలు స్మరించుకుంటూ. ఆ సమయంలో ఆయన భారతదేశం లో విద్య గురించి రాస్తూ విద్య దేశీయ భాషాల్లోనూ, ఇంగ్లీష్ లోనూ సాగాలని సూచిస్తాడు, సంస్కృతం లోనూ, పర్షియన్ లోనూ కాకుండా. టైమ్స్ పత్రిక కు గౌరవ వేతనం మీద భారత దేశం గురించి తరుచూ రాస్తూ వుంటాడు.
గుల్బర్గా కి దగ్గర్లో వున్న ‘ సురపురం’ సంస్థానం చిక్కుల్లో పడుతుంది. సంస్థానాన్ని ఏలుతున్న రాజు చనిపోతాడు. రాజుగా వచ్చిన కొత్త వ్యక్తి నుండి ఏటేటా పెంచే కప్పమే కాకుండా 15 లక్షల నజరానా తీసుకుంటాడు నిజాం. సురపురం సంస్థానం వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పుచేసి నజరానా చెల్లిస్తుంది. వడ్డీ వ్యాపారస్థులు, సంస్థానం మధ్య గొడవలు, వడ్డీ వ్యాపారస్తులు, నిజాం మధ్య గొడవలు. సంస్థానానికి వారసులు, చనిపోయిన రాజు భార్య రాణీ ఈశ్వరమ్మ మధ్య గొడవలు, 12,000 మంది బేడర్ల ని చేతిలో పెట్టుకుని రాణీ తిరుగుబాటు ప్రయత్నం. అక్కడున్న ప్రతినిధి చేతులెత్తేశాడు. ఎటువంటి చిక్కుపరిస్థితుల లోనించయినా నేర్పుగా బయటపడేసే సామర్ధ్యం మెడోస్ టైలర్ కి వుందని నమ్మిన అతన్ని అక్కడికి పంపుతాడు ‘ రెసిడెంట్ ‘.
‘సురపురం లో ఎవరినీ నమ్మటానికి వీలులేదు. పైకి పెద్ద మనుషులవలెనే కనపడతారు. తేలికగా ద్రోహం, దౌష్ట్యం చేస్తారు. కొంచెం హెచ్చరికగా వుండండి ‘ అని అంతకుముందు అక్కడ పనిచేసిన రాజకీయ సలహాదారు చెప్పాడు. చనిపోయిన రాజు ఎనిమిది సంవత్సరాల కొడుకుని వారసుడిగా గుర్తిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అతనికి యుక్త వయస్సు వచ్చేవరకు చనిపోయిన రాజు తమ్ముడు పెద్ది నాయక్ రాజ ప్రతినిధిగా కొనసాగుతాడు. అది కాదన్నవారు తిరుగుబాటు చేసిన వారేనని వాళ్ళని అణచివేయవలసిందనీ మెడోస్ టైలర్ స్పష్టంగా చెబుతాడు. ఇక అక్కడ్నుంచి అత్యంత నాటకీయంగా భయపెట్టవలసినవాళ్ళని భయపెట్టి, బుజ్జగించవలసిన వాళ్ళని బుజ్జగించి, కఠినంగా వుండవలసి దగ్గర కఠినంగా వుండి, రక్షణ కల్పించవలసిన వాళ్ళకి రక్షణ కల్పించి, శిక్షించవలసినవాళ్ళని శిక్షించి దిన దిన నాటకీయ పరిణామాల మధ్య ఆ ఎనిమిదేళ్ల రాజకుమారుడికి తనే స్వయంగా చదువుచెబుతూ పరిస్థితిని మొత్తం తన చేతిలోకి తీసుకుంటాడు.
ప్రతిరోజూ రాజకోట రహస్యం లాటి పరిణామాల మధ్య అన్నిటినీ చక్కగా నిర్వహించిన మెడోస్ టైలర్ 1841 నుండి 1853 వరకు సంస్థానం లో ఎం చేశాడనేది చదివి తీర వలిసిందే.
ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సంస్థానాన్ని నిర్వహించటమే కాకుండా సంస్థానపు ప్రజలకి చాలా మేళ్ళు చేసాడు మెడోస్ టైలర్. గ్రామలన్నీ తిరిగి భూముల కొలతలను గూర్చి, పన్నులను గూర్చి ఉద్యోగులకు తగు సూచనలు చేస్తూ, బేడర్లు చేస్తున్న పశువుల చోరీలు తదితర దొంగతనాలు విచారిస్తూ, ఖజానా ఏర్పాటు చేసి రాజ ప్రతినిధి పెద్ది నాయక్ మోసం చేయకుండా సక్రమమయిన ఖర్చులు పెట్టమని సలహా చెబుతూ అతడ్ని హెచ్చరిస్తూ, బుద్ధి చెబుతూ వుండేవాడు మెడోస్ టైలర్. గ్రామ ప్రాంతాలకు పర్యటనకు వెళుతూ, పొలాలు కౌలుకు తీసుకుని పంటలు పండించుకొమ్మని, కౌలు కత్తులు రాయమని రైతుల్ని ఆడిగేవాడు. మీ రాతకోతలు నిలిచివుంటాయా అని అడిగినవారికి మీ కష్ట సుఖాల్ని గమనిస్తూ ఉంటానని మాట ఇచ్చేవాడు.అతని మాటల్లోనే వినండి.
“బొంబాయి రాష్ర్ట హద్దుల్లో పలువురు రైతులు తమంత తామే వచ్చి భూములు పుచ్చుకున్నారు. ఎక్కడికి వెళ్లినా నా గుడారం చుట్టూ వందల రైతులు చేరే వారు”.
“వాళ్ళకి మాపద్ధతులే వింతనిపించాయి. నా పట్ల ఎంతో విశ్వాసంచూపించేవాళ్ళు. అంత బాగా నా జీవితంలో ఎప్పుడూ నేను పనిచేయలేదు. అంత హాయిగా తిరగానూ లేదు. అంత హాయిగా నిద్రించానూ లేదు “
“ భాగ్యవంతులు సరిగా పన్నులు ఇవ్వరు. వారికంటే పేదలే నయం, గత 50 సంవత్స రాలుగా లెక్కలను ఎవరూ సరిగా రాసివుంచట్లేదు. వసూలయినదాన్ని సరిగా ఖజానా కి ఇవ్వట్లేదు దీన్ని సరి చేయాలంటే ఇంకొన్నాళ్లు పడుతుంది”
“గ్రామాల్లో పరిస్థితి తెలుసుకోవటానికి రోజుకి పన్నెండు గంటలుపనిచేసినా సరిపోదు. క్రౌర్యాలు,వత్తిడులు,మోసాలు,అసత్యాలు ఎన్నోబయటపడుతున్నాయి.తెలుసుకున్నకొద్దీపుట్టల్లోనిపాముల్లాగావెలువడుతున్నాయి “
“ప్రజల కష్టాలు తెలుసు కోవటానికి ఎందుకు అంత శ్రమ పడతావు. దువ్విన కొద్దీ దువ్వెన విరగటమే కానీ చిక్కులు విడవు. ఒకసారి జుట్టు గొరిగేస్తే మళ్లీ పెరుగుతుంది. చిక్కులు పడకుండా జాగ్రత్త పడవచ్చు” అని ఒక స్నేహితుడు హితవు చెప్పాడు. దారుణమయిన హితవు, ఓపికతో దువ్వెననే ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను అంటాడు.
సరిహద్దుల్లో అల్లర్లు తగ్గినయ్యి.పశువుల చోరీలు లేవు. ఏదయినా నేరం జరిగితే నేరం చేసినవారిని పట్టుకుని కొట్టడానికి, వాళ్ళ ఇళ్లు తగలపెట్టటానికి ప్రజలు సాయుధముఠాలుగా బయలు దేరటం లేదు. ఏదయినా నేరం జరిగితే అధికారులకి ఫిర్యాదు చేస్తున్నారు
ఈ లోపు తన భార్యకి జబ్బు చేసి చనిపోతుంది.
“ఆమె నా భార్య. ప్రియురాలు. నా సుఖశాంతులు కోరిన వ్యక్తి.సురపురం లో సుఖం లేకుండా జీవితం గడపమని అన్నట్లుగావెళ్ళిపోయింది. ఆమెసానుభూతి లేకుండానే ఇక నేను పనిచేసుకోవాలి. ఆమె లాలన లేకుండానే జీవయాత్రగడపాలి.
ఆమె మరణానంతరం నా ఆరోగ్యమూ చెడింది. నా ఇల్లు కట్టడమూ పూర్తయింది ఎవరు వుంటే నాకిది ఇల్లు అవుతుందో వారు లేకపోయిన తరువాత ఈ ఇల్లు నేనేమి చేసుకోను” అంటాడు.
నిజాం బ్రిటిష్ వారికి ఇవ్వవలసిన అప్పు కి బదులుగా కొన్ని జిల్లాల్ని బ్రిటిష్ వారికి దత్తత ఇస్తాడు. రాయచూరు కి పక్కనున్న ‘ నల్ దుర్గ్ ‘ కూడా అందులో ఒకటి. అరబ్బులు ఎక్కువగా వుండే ప్రాంతం. నిజాం తమకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేవరకు కోటలో అడుగుపెట్టనివ్వమని బీరాలు పోయినా నిజాం తోనే తేల్చుకొమ్మని లేదంటే సైనిక ప్రయోగం చేస్తామనే మెడోస్ టైలర్ మాటలకితగ్గి కోట ని స్వాధీనం చేస్తారు. మెడోస్ టైలర్ సహాయకుడు ఒక ఇంగ్లాండ్ వాసి. అతని తండ్రి ఏడింబరో లో న్యాయవాది. స్కాట్లాండ్ అంత దేశాన్ని ఇద్దరు బ్రిటిష్ ఉద్యోగులు చిన్న పదాతి దళ సహాయం తో ఆక్రమించి అదుపులోకి తీసుకురావటం కనీ వినీ ఎరుగని సంఘటన అని ఆశ్చర్య పోతాడు. 1853 నుండి1857 వరకు ‘నలదుర్గ్’ కి అసిస్టెంట్ అసిస్టెంట్ కమీషనర్ గా చేసాడు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని పనులు ఎవరయినా చేయగలరా అని ఆశ్యర్య పోయేటన్ని పనులు చేసాడు ఆ కొద్ది కాలంలో.
నలదుర్గ్ జిల్లాలో బందిపోట్ల బెడద ఎక్కువగా వుండేది. ఆ జిల్లాలో న్యాయస్థానాలు లేవు. నిజాం ప్రభుత్వ ప్రతినిధులు, అరబ్బులు నేరాలు చేసినవారినే శిక్షించేవారు. చిన్న నేరాలు చేసిన వారినే శిక్షించేవారు. బందిపోట్లను శిక్షించలేరు. నిజాం ప్రభుత్వ పతినిధికి వాటాలుండేవి. బందిపోట్లతో ప్రభుత్వోద్యోగులు షరీకై వుండేవాళ్ళు. ఇక హత్యలు ఎన్నడూ ఎవళ్ళూపట్టించుకున్నదే లేదు.కొన్నిసంవత్సరాలుగా ఈ ప్రాంతంలో న్యాయస్థానాలే లేవు. మెడోస్ టైలర్ బొంబాయి రాష్ట్ర పద్ధతి లో ఒక శాసనావళిని, నిబంధనావళిని రూపొందించాడు. గ్రామ పటేళ్లకూ,తాలూకా ఉద్యోగులకూ సహాయకుల్ని ఏర్పాటు చేశాడు. గ్రామ పటేళ్లకూ, తాలూకా ఉద్యోగులకు, తనకూ అంచెలవారీగా విచారణాధికారాలు కేటాయించాడు. ‘తను చేసిన తీర్పులపై రెసిడెంట్ కి అప్పీల్ చేసుకోవచ్చు’.
మెకాలే రచించిన శాసనావళి అమలు చేసేటప్పుడు, ఆస్తి హక్కుల దావాలకు సంబంధించి మెడోస్ టైలర్ రూపొందించిన శాసనావళినే యధాతధంగా మెకాలే శాసనావళిని లో వుంచేశారు. ఇవే కాకుండా వివిధ శాఖలూ, ఉద్యోగులూ అనుసరించదగు నియమావళిని కూడా రూపొందించాడు. 1854 లో నలదుర్గ్ తూర్పు ప్రాంతం దుర్భరమయిన పరిస్థితుల్లో వుండేది. అంతకు ముందు పాలించింది అరబ్బులు. వాళ్ళ హయాంలో హత్యలు, దోపిడీలు, పంటల విధ్వంసం యధేచ్చగా సాగాయి. జిల్లా పరిపాలనను సరిదిద్దటానికి కోడి కూత నుండి రాత్రి 8 గంటలవరకూ పనిచేశాడు మెడోస్ టైలర్. ఇప్పుడు నలదుర్గ్ జిల్లాలో బందిపోట్లు లేరు. బందిపోటు దొంగతనాలన్నీ నిజాం పరిపాలనా కాలంలోనే. పోలీసులు నిక్కచ్చిగా పనిచేస్తున్నారు. ప్రతి గ్రామ పటేలుకు కొంతవరకు న్యాయ నిర్ణయాధికారాలు ఇచ్చాడు. అందువల్ల గ్రామోద్యోగుల గౌరవం పెరిగింది.
మాలిక్ అంబర్ కాలం లో సెటిల్మెంట్ వివరాలు గ్రామోద్యోగుల దగ్గర వున్నాయి. వాటిని ఆధారం చేసుకుని కొత్త వివరాలను చేర్చి సెటిల్మెంట్ పని మొదలెట్టాడు. పంజాబు ప్రాంతంలో సర్వే పద్ధతుల్ని చెప్పే ఒక పుస్తకం సహాయంతో ప్రతి గ్రామాన్ని సర్వే చేయించాడు. సర్వే కి కావలసిన కొన్ని పరికరాల్ని తయారుచేసుకుని, కొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చి సర్వే చేయించాడు. ప్రభుత్వం ఇతని పనితీరుని ఆమోదించింది. మెడోస్ టైలర్, అతని ఉద్యోగులు చేసిన పని చాలా పెద్దది. మొత్తం 34,474 వివరణ పత్రాలు, జాబులూ ఇంగ్లీష్ లో, పర్షియన్ లో, మరాఠీలో వాళ్ళమధ్య నడిచాయి. అతనికీ, అతని సహాయకులకీ మధ్య నడిచిన ఉత్తరాలే ‘తొమ్మిది వేలు’న్నాయి. నలదుర్గ్ జిల్లాలో మొత్తం 2 లక్షల 60 వేల ఎకరాల సర్వే పూర్తి అయింది. భూమి హక్కు స్థిరంగా వుండేటట్లు తగు చర్య తీసుకోవాలని ప్రతిపాదించి 30 ఏండ్ల పాటు ఆ హక్కు వుంటుందని నిర్ణయించాడు. అప్పటివరకూ సిస్తు మారదు. రైతుకు తన భూమి హక్కు సురక్షితమనే భావం వుంటేనే భూమిపై పెట్టుబడి పెట్టటం, శ్రమించటం సాధ్యమవుతుందని మెడోస్ టైలర్ అంటాడు.భూమి హక్కుకూ, శిస్తుకూ సంబంధించిన వివరాలన్నీ మరాఠీ భాషలోకి అనువదించి, గ్రామ పెద్దలనందరినీ పిలిపించి,తను చేస్తున్న పనులనూ, ప్రభుత్వ అనుమతి లభిస్తే చేయ తలపెట్టిన పనులను వివరించి చెబుతాడు.మునపటివలె ఎవరూ భూఖామందును భూమినుండి వెళ్ళగొట్టరనీ, శిస్తులు యథేచ్ఛగా పెంచే అవకాశం లేదని చెబుతాడు.
అక్కడున్నవారందరూ ఒక కొత్త యుగం ప్రారంభమయినదని సంతోషపడతారు. రెసిడెంట్ కూడా పంజాబులో జరుగుతున్న పాలన కంటే నలదుర్గ్ ప్రాంతం లొనే పరిపాలన బాగా సాగుతున్నదని చెబుతాడు.
అహ్మదనగర్ ప్రాంతాన్ని చూసి ఎన్నో వాగులున్నాయి. నీరు పుష్కలం. చక్కటి జలాశయాలు నిర్మించుకుంటే సేద్యం ఎంతయినా అభివృద్ధి చెందుతుంది అనుకుంటాడు.తుల్జాపురం లో రెండు జలాశయాలు నిర్మించాలని పథకం వేసుకుంటాడు. తుల్జాపురం నుండి అహ్మద్ నగరం వరకు చెరువుల నిర్మాణం చెయ్యాలని సూచిస్తాడు. ఆ ప్రాంతాలలో కాటకం ఏ క్షణాన్నైనా ముంచుకు రావొ చ్చని జలాశయాలకి కావలసిన పరిశీలనలు, విషయసేకరణ అన్నీ చేస్తాడు.
గోదావరి నదికి నలదుర్గ్ జిల్లాకి మద్ధ్యలో ఎంత వర్షం పడుతుంది, ఎన్ని వాగులు ఎట్లా ప్రవహిస్తున్నవి, ఎన్ని చెరువులు ఏర్పాటు చేయవచ్చును అనే విషయమై 600 చదరపు మైళ్ళ మేర క్షుణ్ణంగా పరిశీలన చేసాడు. భటోరి దగ్గర అహ్మద్ నగరానికి నీళ్లు సరఫరా చేసే పెద్ద సరస్సు నిర్మాణం చేపడతాడు. చాలా చోట్ల రహాదారుల నిర్మాణం చేపడతాడు. మెడోస్ టైలర్ జాతకం చెప్పిన ఒక జ్యోతిష్కుడు చెప్పినట్లు ” మీరు పనిచేయటానికే పుట్టారు, భోగభాగ్యాలలో దొర్లటానికి పుట్టలేదు. ఇక మీ జీవితం ఇంతే “. అది నిజమేనేమో.
1857 లో భారత దేశం లో తిరుగుబాటు పరిస్థితులదృష్ట్యా క్లిష్టమయిన బీరార్ జిల్లాకి బదిలీ చేస్తారు మెడోస్ టైలర్ ని.
మెడోస్ టైలర్ బదిలీ మీద బీరార్ కి పొయ్యేటప్పుడు ప్రముఖ ఉద్యోగులు 1622 మంది సంతకాలతో ఒక సన్మాన పత్రాన్ని సమర్పించి వీడ్కోలు చెప్పారు. అతని మాటల్లోనే చదవండి …
” సభలో పలువురు కన్నీరు కార్చారు. మహాదేవ బాబా కి జై అని నినదించారు. నా కళ్లల్లో నీళ్లు తిరిగినవి. వాళ్ళకి ఉపయోగకరంగా నేనే దయినా చేసి వుంటే ధన్యుడిని. ఆ రాత్రి నేను ప్రయాణమై పోతూ వుంటే వేలాది ప్రజలు వీధులలో నిలబడి మహాదేవ బాబా కి జై అంటూ 2 మైళ్ళదూరం నడిచి వచ్చారు. సురపురం నుండి వచ్చేస్తుంటే మనస్సు బాధ చెందింది. ఇక్కడినుండి వెళ్లిపోతుంటే వాళ్ళ ఆదరం నుండి దూరమయి పోతున్నట్లనిపించింది.”
నలదుర్గ్ నుండి బయలుదేరిన మెడోస్ టైలర్ ‘ బ్రిటిష్ పరిపాలకుల వలన దేశంలో శాంతి నెలకొన్నది పరిపాలన ఇక క్రమంలో రూపొందుతున్నది ? అటువంటప్పుడు తిరుగుబాటు ఆలోచన దేనికి ? ‘ అనుకుంటాడు. బీరార్లో ఆర్ధిక పరిస్థితులు, శాంతి భద్రతలు అస్తవ్యస్తం గా వున్నాయి. 20 లక్షల జనాభా వున్న బీరార్ కి సహాయంగా పంపటానికి సైన్యం లేదు. నైతిక బలంతో అదుపు చేయండి అని రెసిడెంట్ కబురు చేస్తాడు. బీరర్ చుట్టుపక్కల అన్ని సంస్థానాలు, నవాబులు ఏదో ఒక మేరకు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం లో వున్నాయి. అది బీరార్ దాటితే నిజాం రాజ్యానికి కూడా పాకే ప్రమాదముంది. నిజాం మొఘల్ చక్రవర్తుల మీద వ్యతిరేకతతో బ్రిటిష్ సైన్యానికి సహాయం చేస్తున్నాడు. నిజాం ని, రెసిడెంట్ ని చంపాలని ‘ రోహల్లా’ లు హైదరాబాద్ రెసిడెన్సీ మీద దాడి చేశారు. బీరార్ లో కూడా కొన్ని సైనిక స్థావరాల్లోనించి సైనికులు వెళ్లిపోయారు. ఉన్నవాళ్ళని నమ్మేటట్లు లేదు.
మెడోస్ టైలర్ ని చంపమని, చంపేసామని, చంపేస్తామని ప్రతిరోజు వార్తలొస్తున్నాయి. కానీ మెడోస్ టైలర్ ప్రజలమధ్యనే గుడారం వేసుకుని పనిచేస్తూ తిరుగుబాటు బీరార్ కి వ్యాప్తి చెందకుండా చూస్తున్నాడు. ఎక్కడైతే కుదురుతుందో అక్కడల్లా స్థానిక సహాయం తీసుకుంటున్నాడు. నాగపూర్ కి అతను బీరార్ నుండి పంపిన 600 ఎడ్ల బండ్ల వలన మధ్యభారతం లో తిరుగుబాటు ని అణచటం సాధ్యమైంది. 1858 కల్లా పరిస్థితులు బ్రిటిష్ వాళ్ళ అదుపులోకి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పోయి ప్రత్యక్షంగా రాణీ గారి పాలన వచ్చింది.
సురపురం లో ఏదో సమస్య తలెత్తిందని, తక్షణం హైదరాబాద్ రావాలని రెసిడెంట్ నుండి జాబు రావటం తో మెడోస్ టైలర్ మళ్ళీ వెనక్కి బయలుదేరతాడు. సురపురం రాజ కుమారుడు బ్రిటిష్ సైన్యంపై దాడి చేసి ఓడిపోయి హైదరాబాద్ కు పారిపోగా, అక్కడ అతనిని ప్రభుత్వం పట్టుకుని నిర్బంధంలో వుంచింది. పీష్వాల నాటి మహారాష్ట్ర ప్రాభవాన్ని ఉద్ధరించటానికి సురపురం సంస్థానాదీసుల వంటి వారు పూనుకుని తిరుగుబాటును సానుకూలం చేయాలని రాజకుమారుడికి ఎవరో ఉపదేశం చేశారు. పదివేల మంది బేడర్లతో బళ్లారి, ధార్వాడ్, బెల్గాం -రాయచూరు ప్రాంతాన్ని అతడు పట్టుకుంటే మిగిలినవారు అతడి నాయకత్వాన్ని అనుసరిస్తారని తిరుగుబాటుదారులు నూరిపోశారు.
సురపురం మీద బ్రిటిష్ వాళ్ళు దాడిచేయగా ఎక్కడివాళ్ళక్కడ పారిపోయారు. సహాయం కోసం హైదరాబాద్ వచ్చిన రాజకుమారుడు వీధుల్లో తిరుగుతుండగా పట్టుకున్నారు. తండ్రి లాటి మెడోస్ టైలర్ తో మనసు విప్పి మాట్లాడిన రాజకుమారుడ్ని రక్షించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఉరిశిక్ష పడుతుందనుకున్న రాజకుమారుడికి మెడోస్ టైలర్ ప్రయత్నాల వలన నాలుగు సంవత్సరాలు ఖెదు పడుతుంది. అనుమానాస్పద పరిస్థితుల్లో రాజకుమారుడు మరణిస్తాడు. సురపురానికి కమిషనర్ గా పంపిస్తారు మెడోస్ టైలర్. ఒక సంవత్సరం అక్కడుండి అస్తవ్యస్తమయిన పరిస్థితుల్ని వీలయినంత వరకు సరిదిద్ది తన ఆరోగ్యం బాగోలేక ఇంగ్లాండు కి బయలుదేరతాడు మెడోస్ టైలర్.
సురపురం ప్రజల వద్ద వీడ్కోలు తీసుకోవటం కష్టమైంది మెడోస్ టైలర్ కి. అతని మాటల్లో వినండి…
“నా చేత దర్బారు జరిపించి మరాఠీ భాషలో నాకొక వీడ్కోలు పత్రం సమర్పించారు. నే చేసిన పనులన్నీ పేరు పేరునా పేర్కొని నాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారిలో నేను ఎరగని వారు లేరు. కొందరు నా ఎదుట పెద్దలయినవారే. నన్ను వారు మరిచిపోరు. నేనూ వారిని మరిచిపోలేను. ఎవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి లేచిపోదామని అనుకున్నాను. అర్ధరాత్రి చూద్దును కదా అందరూ రోడ్లమీదనే వున్నారు. బేడర్లు అందరూ అక్కడే కాపలా వేశారు. కొందరు ఏడ్చారు. కొందరు నిశ్శబ్దం గా నాతో నడిచారు”
” ఇప్పుడు మాకు దిక్కు లేదు. ఉదయం ధాన్యం దంచుకునేటప్పుడు, సాయంత్రం దీపం వెలిగించుకునేటప్పుడు మా స్త్రీలు మీ పేరే తలుచుకుంటారు. తప్పక తిరిగి రండి ” అన్నారు.
దోవలో ప్రతి గ్రామంలో అబాలగోపాలం ఇలాగే వీడ్కోలు ఇచ్చారు. వారి బిడ్డలను ఆశీర్వదించుతూ తాకమన్నారు. ఒకచోట కొందరు ” మేమంటే మీకెందుకంత ఇష్టం. మమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నారు ?” అని అడిగారు. దీనికి జవాబు లేదు. నేను పేరు కోసం ఏనాడూ తంటాలు పడలేదు. చేతనయినంతవరకు న్యాయం చేకూర్చటానికి ప్రయత్నం చేశాను. ప్రతి విన్నపాన్ని విన్నాను. నన్ను వచ్చి కలుసుకోవటానికి ప్రతివారికీ అవకాశం కల్పించాను. వారు చూసిన ఇంగ్లీషు మనిషిని నేనొక్కడినే. నా మీద ఎవ్వరూ ఏనాడూ ఫిర్యాదులు చేయలేదు. మామూలు మర్యాదలే వారిపట్ల చూపాను.
” ప్రజలకు ఇంత మేలు చేస్తున్నావు కదా -ప్రతిఫలం ఏమిటి? వారు ఏమయినా నీకు కృతజ్ఞత చూపెట్టారా ? ” అని కొందరు స్నేహితులు అడిగారు.
ఇది సరియయిన ప్రశ్న కాదు. నేను ప్రజలకు చేయగలిగినదంత చేయలేదు. నాకు ఎక్కువ సహాయం లభించివుంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలిగి వుండేవాడిని. నాకు చేతనయినంత చేశాననటానికి భగవంతుడే సాక్షి. ఇంకా ఎంతో చెయ్యగలిగి వుండేవాడిని. ఆరోగ్యం లేదు.’
‘ నా ఆరోగ్యం బాగుంటే భారతదేశాన్ని వదిలిపోయ్యేవాడిని కాను. భారతదేశమన్నా, భారతీయులన్నా నాకు మక్కువ. ఒక్కసారి ఇంగ్లాండు వెళ్లి తిరిగి వచ్చి, పనిచేస్తూనే ప్రజల మధ్య చచ్చిపోవాలి. ‘
అని అనుకుంటూ వెళ్లిన మెడోస్ టైలర్ అనారోగ్యం మూలాన తిరిగి రాలేకపోయాడు.
ఇంగ్లాండు తిరిగివెళ్లిన మెడోస్ టైలర్ ‘ భారతదేశంలో ఒంటరి జీవితం గడిపిన నా ముఖాన, పెదవుల చివర, పడిన ముడతలన్నింటిని నా బిడ్డలు చదును చేశారు. ఇస్త్రీ చేశామని వారే చెప్పారు.’ అని మురిసిపోయ్యాడు. అనారోగ్యం మూలాన తిరిగి రాలేక ‘ నేను ప్రజల మధ్య బతికాను. వారితో నాకు ఆత్మీయత ఏర్పడింది. మళ్ళీ వారి మధ్యకు వెళ్లి సేవ చేసే భాగ్యం లేకుండా చేసాడు భగవంతుడు.’ అని బాధ పడతాడు.
సురపురం లో నలదుర్గ్ లో వున్నప్పుడు టైమ్స్ పాత్రికకు దేశీయ భాషలలో విద్యా బోధన జరగాలని అనేక వ్యాసాలు రాసాడు. ఇంగ్లాండు వచ్చాక 1657 కాలానికి చెందిన మరాఠా రాజ్య అవతరణ కి సంబంధించి ‘తార’ అనే నవల, 1757 కాలానికి సంబంధించి,’ రాల్ఫ్ డార్నెల్ ‘ అనే నవల,ఇందులో బ్రిటిష్ అధికారం ఎలా విస్తరించిందో రాస్తాడు.1857 కాలానికి సంబంధించి, బ్రిటిష్ అధికారాన్ని వదులుకోవటానికి భారతదేశంలో వివిధ వర్గాలు చేసిన ప్రయత్నం మూడవ నవల ‘ ‘సీత’ రాసాడు. చిత్రకారుడు కాబట్టి భారతదేశాన్ని గురించి ఎన్నో చిత్రాలు, స్టూడెంట్స్ మాన్యువల్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా ‘ అనే పుస్తకం రాసాడు. భారతదేశంలో సేద్యపు వనర్లు వాటికి గట్లు, తూములు అమర్చే పద్ధతి, వాన నీటిని ఉపయోగించుకునే కృషి వీటిని గురించి ‘ ఐర్లాండ్ ఇంజినీర్ల ‘ సంస్థ లో ఉపన్యసిస్తాడు. భారతదేశానికి వెళ్ళినప్పుడు మెడోస్ టైలర్ కి చదువు లేదు. స్వయంగా చదువుకున్నాడు. చెప్పుకోదగిన భోగభాగ్యాలు లేకపోయినా, దేవుని దయవలన తినటానికి ఉంది నా బిడ్డలు నన్ను ప్రేమిస్తున్నారు, నా మిత్రులు నన్ను ఆదరిస్తున్నారు, ఇంతకంటే కావలసింది ఏముంది అనుకుంటాడు.
భారతీయ జీవితాన్ని, కథలను గాధలను చక్కగా చిత్రీకరించవలసిన వారు భారతీయ విద్యావంతులే. హిందూ సంఘం లో నెలకొనివున్న దురాచారాల గురించే ఎందుకు రాయాలి. మంచి సంప్రదాయాల గురించి కూడా రాయొచ్చు కదా, సరళంగా, సహజంగా,ప్రజల మనస్సులను కదిలించే అనేక విషయాలపైన రాయండి. దేశీయమైన భాషలలో ప్రజలకు ఆప్యాయకరమైన సాహిత్యం వెలువడి జాతీయ సాహిత్యాభివృద్ధికి పునాదులు పడాలి ‘ అంటాడు.
1875 లో మొదటి సారి వచ్చిన 51 సంవత్సరాల తరవాత మరలా భారతదేశాన్ని చూడాలనుకుని ఈసారి బొంబాయి నుండి హైదరాబాద్ కి 27 గంటల రైలు ప్రయాణం చేసి మిత్రులందర్నీ కలిసి తిరుగు ప్రయాణం లో ‘ మెంటోస్ ‘ దగ్గర ప్రశాంతంగా ‘విధి నిర్వహణకై కృషి చేసిన వ్యక్తిననే నన్ను భగవంతుడు సంభావించుకాక ‘ అని కన్నుమూస్తాడు.

' విద్యా వ్యాపార పాపాలే ఈ ఆత్మహత్యలు '

' విద్యా వ్యాపార పాపాలే ఈ ఆత్మహత్యలు ' అన్న వ్యాసం . ఇది రాసింది dr . లావు రత్తయ్య , విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత . ఈరోజు ఆంధ్రజ...